ఆ సమాచారాన్ని విదేశాల నుండి తీసుకుంటా : ట్రంప్
అమెరికా అధ్యక్ష పదవికి 2020లో జరిగే ఎన్నికల్లో తన ప్రత్యర్థికి సంబంధించి విదేశాల నుండి అందే సమాచారాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యులో ట్రంప్ ఈ విషయం ప్రస్తావించారు. అధ్యక్ష పదవికి పోటీచేసే అభ్యర్థి విదేశీ సహాయాన్ని పొందడంలో తప్పేమీ లేదని వాదించారు. అంటే అధ్యక్ష ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని అంగీకరిస్తున్నారా? అని అడగా విదేశాల నుండి కేవలం సమాచారం మాత్రమే తీసుకుంటామని చెప్పారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయముందని వచ్చిన ఆరోపణలపై ప్రత్యేక న్యాయవాది రాబర్ట్ ముల్లర్ దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం గత రెండేళ్ళుగా ట్రంప్ ప్రభుత్వాన్ని వెంటాడుతోంది.
అధ్యక్ష పదవికి పోటీచేసే అభ్యర్థికి సంబంధించిన సమాచారాన్ని విదేశం నుండి పొందడంలో తప్పేమీ లేదంటూ ట్రంప్ తాజా వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. రష్యా, చైనాలు ప్రత్యర్థిపై సమాచారం ఇచ్చేందుకు సిద్ధపడితే ఏం చేస్తారని అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిస్తూ సహాయం తీసుకోవడం వరకు తప్పేమీ లేదని, అంత మాత్రాన అది జోక్యం చేసుకోవడం కాదని అన్నారు. తాను కూడా సమాచారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.













