యాంకర్ సుమ కనకాలకు అరుదైన గౌరవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చికాగోలోని ట్రై-స్టేట్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ఆధ్వర్యంలో యాంకర్ సుమ కనకాలతో సుమతో సందడి అనే కార్యక్రమాన్ని అమెరికాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమెరికా నలుమూలలా ఉన్న మహిళలతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీటీఏ సంస్థ అధ్యక్షురాలు అపర్ణ అయ్యలరాజు ఈ కార్యక్రమ ప్రారంభోపన్యాసం చేస్తూ సంస్థ భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. దాదాపు రెండు వందల మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో మహిళలు కూడా తమ మాటల్లో, పాటల్లో చేతల్లో ఎంతో సృజనాత్మకతను చూపారు. మూడు గంటల పాటు జరిగిన సుమతో సందడిలో ప్రశ్నలు-సమాధానాలు అనే పోటీ కార్యక్రమాన్ని యాంకర్ సుమ తనదైన శైలి, సమయస్ఫూర్తితో ఆద్యంతం రక్తికట్టించారు.
ఈ సందర్భంగా ట్రై-స్టేట్ అసిసోయేషన్ తెలుగు ప్రజల తరపున సుమకు సకల కళాభినేత్రి అనే బిరుదు ఇచ్చి సత్కరించారు. అరవై నాలుగు కళల్లో వినోదం ఒక కళ అయితే, వినోద పరచడంలో అరవై నాలుగు కళలను ప్రదర్శించే సుమకు ఈ బిరుదు ఇవ్వటం గౌరవ ప్రదంగా భావిస్తున్నామని సంస్థ సమన్వయకర్త ప్రణతి కలిగోట్ల అన్నారు. చివరలో సంస్థ తరపున, ప్రణతి కలిగ్లో వందన సమర్పణ చేస్తూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన రవి వేమూరి, రాధిక గరిమెళ్ళ, రాజేంద్ర రెడ్డి, దిలీప్ రాయలపూడి, రామకృష్ణ కొర్రపోలు, 13 ఏళ్ల వేమూరి రిషి కార్తీక్‌లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.













