NATS: ఇది మన తెలుగు సంబరాలు… అందరూ రండి ప్రశాంత్ పిన్నమనేని, చైర్మన్, నాట్స్
ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) 8వ తెలుగు మహాసభలు ‘‘అమెరికా తెలుగు సంబరాలు’’ పేరుతో జూల్కె 4,5,6 తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇది మన తెలుగు సంబరాలు…ఇందులో ఎన్నో కార్యక్రమాలు మీకోసం ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు వైభవాన్ని, తెలుగువారి ఖ్యాతిని తెలియజేసేలా అమెరికాలో మునుపెన్నడూ లేని విధంగా తెలుగు పరిమళాలను వెదజల్లుతూ.. ఆధ్యాత్మిక, సాహితీ, కళ, సినిమా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులతో ఈ తెలుగు సంబరాలను ఏర్పాటు చేశాము. హిల్స్‌బరో నది ఒడ్డున డౌన్‌టౌన్ అందాల నడుమ ఉన్న టాంపా కన్వెన్షన్ సెంటరు ఈ సంబరాలకు వేదికగా నిలిచింది. ఈ సంబరాలను విజయవంతం చేయడంకోసం ఎంతోమంది కమిటీ సభ్యులు, వలంటీర్లు, నాట్స్ నాయకులు ఇతరులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు.
అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏర్పాట్లను ప్రారంభించాము. నేడు ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ ఆధ్వర్యంలో వివిధ కమిటీలు తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చాయి. సంబరాలను పురస్కరించుకుని అమెరికావ్యాప్తంగా కథలు, కవితలు, పద్యాల పోటీలను నిర్వహించాము. వీటితో పాటు క్రీడా, సాంస్కృతిక పోటీలను సైతం నిర్వహించి సంబరాల ప్రచారాన్ని కమ్యూనిటీకి దగ్గరకు తీసుకువెళ్లాము. ఎంతోమందిని ఇందులో భాగస్వాములను చేస్తున్నాము.
గతంలో ఎన్నడూ ఏ తెలుగు అసోసియేషన్‌కు రాని విధంగా ఈ సంబరాలకు అగ్రహీరోలు ముగ్గురు వస్తుండటం విశేషం. దీంతో సంబరాలపై అందరి దృష్టి ఉంది. నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, అల్లు అర్జున్ హీరోయిన్‌లు శ్రీలీల, ఫరియా అబ్దుల్లా, నాటి హీరోయిన్‌లు మీనా, ఆమని, జయసుధ తదితరులు రావడం ఈ సంబరాలకు మంచి గుర్తింపును ఇది తీసుకువచ్చింది. వీరితోపాటు తెలుగు రాష్ట్రాల మంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు వస్తున్నారు.
ఇంతమంది వస్తున్న ఈ సంబరాలకు మీరంతా కూడా తరలి వచ్చి విజయవంతం చేయాలని ఇది మీ ఇంటి సంబరంగా భావించి కుటుంబ సమేతంగా రావాలని కోరుకుంటున్నాను.







