అమెరికన్లకు ట్రంప్ క్రిస్మస్ కానుక
అమెరికన్ ప్రజలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ క్రిస్మస్ కానుకను అందించారు. ఉద్యోగులకు, ఉపాధి సృష్టికర్తలకు పన్ను తగ్గించే బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. పన్ను విధానాలను సవరించడం వల్ల సంపన్నులు, కార్పొరేట్ సంస్థలు లాభపడుతాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెనేట్ ఆమోదించిన లక్షా 50వేల కోట్ల డాలర్ల పన్ను బిల్లులో, కార్పొరేషన్లకు శాశ్వత పన్ను సబ్సిడీలు, వ్యక్తులకు తాత్కాలిక మినహాయింపులు కల్పించారు. సెనేట్ 51-48 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందింది. అంతకు ముందు ప్రజా ప్రతినిధుల సభ కూడా ఈ బిల్లును 227-203 ఓట్ల తేడాతో ఆమోదించింది. ట్రంప్ సంతకం చేశాక బిల్లు చట్టంగా మారుతుంది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అమెరికా చట్టసభలో ట్రంప్‌కు లభించిన మొదటి విజయం ఇదే. లక్షల మంది మధ్య తరగతి అమెరికన్లకు అద్భుతం చూపిస్తానన్న ట్రంప్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ పేర్కొన్నారు.













