సతీష్ వేమన పిలుపు…తానా సభలకు లక్ష డాలర్లు వసూలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మే నెలలో సెయింట్‌లూయిస్ నగరంలో నిర్వహించనున్న తానా 21వ మహాసభల కోసం నిర్వహిస్తున్న నిధుల సేకరణలో భాగంగా వర్జీనియాలోని సితారలో మార్చి 31వ తేదీన తానా నిధుల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ సతీష్ వేమన నాయకత్వం వహించారు. అధ్యక్షుడు జంపాల చౌదరి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న తానా సెయింట్ లూయిస్‌లో నిర్వహించే 21వ మహాసభల ద్వారా మరోసారి తెలుగు సంస్కృతిని ఉన్నతంగా చాటనున్నదన్నారు. ఎల్లలు లేని తెలుగు – ఎప్పటికీ వెలుగు అనే నినాదంతో ఈ మహాసభలను జరుపుతున్నామని చెప్పారు. సతీష్ వేమన సమన్వయంతో నిర్వహించిన విరాళాల సేకరణ కార్యక్రమంలో తెలుగు ప్రముఖుడు గుంటూరు జిల్లా పుల్లడిగుంటకు చెందిన ఉప్పుటూరి రామ్ చౌదరి పాతిక వేల డాలర్లను విరాళంగా ఇచ్చారు. రవి మందలపు 12,500 డాలర్లు, గౌతం అమిర్నేని పదివేల డాలర్లను ఇలా పలువురు ఇచ్చిన విరాళాలు మొత్తం లక్షా 16వేల డాలర్లు అయినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎక్కువ విరాళం ఇచ్చిన రామ్ చౌదరి ఉప్పుటూరి, రవి మందలపు, గౌతమ్ అమిర్నేనిని జంపాల చౌదరి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమానికి నరేన్ కొడాలి అధ్యక్షత వహించారు. యడ్ల హేమ ప్రసాద్, రవి పొట్లూరి, ప్రదీప్ గౌర్నేని, సత్యనారాయణ మన్నె, కిషోర్ దంగేటి, రమాకాంత్ కోయ, రాము జక్కంపూడి, బత్తినేని సోదరులు, జయశేఖర్ తాళ్ళూరి, ధృవ చౌదరి, ధన చిగురుపాటి, రఘు మేకా, హరీష్ కోయా, కిరణ్ దుగ్గిరాల, నాగరాజు నలజుల, సుబ్బారావు కొల్లా తదితరులు పాల్గొన్నారు.













