ఎపి అభివృద్ధికి ఎన్నారైల కృషి మరువలేనిది – సుజనాచౌదరి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్నారైలు చేస్తున్న సేవ మరువలేనిదని కేంద్ర టెక్నాలజీ, సైన్స్ శాఖ మంత్రి సుజనాచౌదరి అన్నారు. పెట్టుబడులను పెట్టడంలోనూ, జన్మభూమి తదితర సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎన్నారైలు పోషిస్తున్న భాగస్వామ్య పాత్ర ప్రశంసనీయమని కొనియాడారు.
ఆదివారం లాస్ ఏంజిల్స్‌లో తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, లాస్ ఏంజిల్స్ తెలుగు అసోసియేషన్, ఎన్ ఆర్ ఐ టి. డి పి, ఏపీ జన్మభూమి, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ, టాస్క్ తదితర తెలుగు సంఘాల ప్రతినిధులతో సుజనా చౌదరి సమావేశమయ్యారు. ఏపీ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు ప్రతినిధి కృష్ణ కిషోర్, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి, డా.ఆలపాటి రవి, శరత్ కామినేని తదితరుల సమక్షంలో సుజనా చౌదరి తెలుగు సంఘాల ప్రతినిధులతో వివిధ అంశాలపై చర్చించారు. నవ్యాంధ్ర అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు, మేనిఫెస్టో అంశాలపై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రతిపక్షాల తీరు వంటి అనేక అంశాలపై తెలుగు సంఘాల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సుజనా చౌదరి ఓపికగా సమాధానమిచ్చారు. విభజన చట్టంలో పేర్కొనని అదనపు ప్రాజెక్టుల కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో తాము సఫలీకృతం అయ్యామని అన్నారు.
2020 నాటికి దేశంలోనే అగ్రగ్రామి రాష్ట్రాల్లో ఆంధ్రా ఒక రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. ఎకనమిక్ బోర్డును వినియోగించుకుని మాతృ రాష్ట్ర అభివృద్ధికి ప్రవాసాంధ్రులు చేయూతనివ్వాలని సుజనా చౌదరి కోరారు.
జయరామ్ కోమటి మాట్లాడుతూ సింగపూర్ అభివృద్ధి నమూనాలో ఏపీ ఎకనామిక్ డెవలప్మెంటు బోర్డును ఏర్పాటు చేయడంలో సుజనా చౌదరి కీలకంగా వ్యవహరించడమే కాకుండా, క్రిష్ణ కిషోర్ వంటి సీనియర్ అధికారిని రాష్ట్రానికి తీసుకురావడం అభినందనీయం అన్నారు. ఎన్నారైలు ఏపీ జన్మభూమి కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తానా ప్రతినిధి సురేశ్ కందెపు, లాటా ప్రతినిధి తిలక్ కడియాల, ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులు మధు బోడపాటి. టాస్క్ ప్రతినిధి రామ్, నాట్స్ ప్రతినిధి వంశీకృష్ణ గరికపాటి, ఏపీ జన్మభూమి సమన్వయకర్తలు పైలా ప్రసాదరావు, సురేశ్ ఐనంపూడి, ఉమాకాంత్ ఉప్పలపాటి, రజనీకాంత్ కాకర్ల, తదితరులు పాల్గొన్నారు.













