టాంపా బే తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
జనవరి 13, 2018 శనివారం నాడు ఫ్లోరిడా తెలుగు సంఘం టాంపా బే వారు ఐసీసీ హాల్ లో సంక్రాంతి సంబరాలు ఎంతో ఉత్సాహంతో జరుపుకున్నారు. రంగు రంగుల ముగ్గుల పోటీలతో మొదలైన ఈ సంబరాలకు, ఎముకలను కొరికే చలిని సైతం లెక్క చెయ్యకుండా తండోపతండాలుగా తెలుగు వారు హాజరవ్వటం గమనార్హం!
“మాకెంతక్కువ” అంటూ ముందుకువచ్చిన చిన్నారుల పాటలతో పాటు, స్థానిక కళాకారుల నృత్య, గేయ, నాటక ప్రదర్శనలు “వన్స్ మోర్ ” అనేలా అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సంబరాలకు New Jersey నుంచి వచ్చిన ప్రముఖ గాయకురాలు దీప్తి నాగ్ తో పాటు, విజయవాడ వాస్తవ్యుడు, పాడుతా తీయగా, స్వరాభిషేకం, సూపర్ మస్తీ ఫెమ్ గాయకుడు సందీప్ అన్నితరాల వారిని ఉర్రూతలూగించేలా పాడటం, ఆ పాటలకు చిన్న, పెద్దా తేడా లేకుండా అందరూ ఆనందంతో డాన్సులు వేయటం ఈ సంబరానికే ఒక “సంభారం”.
సాంప్రదాయిక తెలుగు వారి నవరసభరితమైన, రుచికరములైన వంటలతో, అరిసెలు, పునుగులు, మురుకులు, జాంగ్రీ వంటి పిండి వంటలతో తెలుగు సంఘం వారు ప్రేక్షకులను మరెంతో ఆకట్టుకుని,”ఆంధ్రులు భోజనప్రియులు” అన్న నానుడిని నిజం చేశారు!
ఆటా-పాటా మాత్రమే కాదు, మన సాంప్రదాయాల్ని కూడా మన తరువాతి తరాలకి అందచెయ్యాలన్న దూరదృష్టితో, తర తరాలుగా పాటిస్తున్నమన తెలుగు వారి ప్రత్యేక “భోగిపళ్లు” పండుగను కూడా జరుపుకోవటం ఈసారి విశేషం.
“నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడూ …” అన్నట్లు భద్రాచలం వాస్తవ్యులైన మిమిక్రీ రమేష్ గారి హాస్యభరితమైన మిమిక్రీ అందరినీ పొట్టచెక్కలు వచ్చేలా నవ్వించి ఈ కార్యక్రమానికి వన్నెతెచ్చింది.
ఇలాంటి కార్యక్రమం మళ్ళీ ఎప్పుడా.. అని ఎదురుచూస్తూ.. కరతాళ ధ్వనులతో ప్రేక్షకులు … ఉగాది కోసం ఎదురుచూస్తూ… వారి వారి ఇళ్ళకి క్షేమంగా చేరుకోవటంతో ఈ సంబరాలు ముగిపుకు వచ్చాయి.













