APNRT: ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రవివేమూరు
నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో తెనాలికి చెందిన ఎన్నారై డాక్టర్ రవి వేమూరు (Dr Ravi Vemuru) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎన్‌ఆర్‌ఐ, పెట్టుబడులు మరియు సేవల విభాగానికి సలహాదారుగా, అలాగే ఏపీ ఎన్‌ఆర్టీ (AP NRT) సొసైటీకి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లి లోని ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ ఆఫీసులో ఆయన బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, టీడిపి నాయకులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాసాంధ్రుల సంక్షేమం, పెట్టుబడులు, సేవల ప్రోత్సాహానికి సంబంధించి ప్రముఖ పాత్ర పోషించే సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏ.పి.ఎన్.ఆర్.టి. సొసైటీ) కి ఆయనను అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెలిసిందే. ప్రవాసాంధ్ర వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వ సలహాదారునిగా కూడా నియమించింది.
గతంలో 2014 నుండి 2019 వరకు చైర్మన్‌గా పనిచేసిన డాక్టర్ రవి వేమూరు తన సేవలో అటు పార్టీలోనూ, ఇటు ఎన్నారైలలో తగిన గుర్తింపును పొందారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఆయన విలువైన సేవలను గుర్తించి, ఎన్నారైలతో సంబంధాలను బలోపేతం చేయడానికి వీలుగా డాక్టర్ రవి వేమూరుకు మరోసారి కీలక బాధ్యతను అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోను, ఎన్నారైల సంక్షేమానికి అవసరమైన చర్యలను ఆయన చేశారు.
ఈ సందర్భంగా రవి వేమూరు మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధిలో ఎన్నారైల భాగస్వామ్యం పెంచేందుకు కృషి చేస్తానని, ఎన్నారైలందరికీ కలుపుకుని పోతానని చెప్పారు. పలువురు ఎన్నారైలు, టీడిపి నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.







