హెచ్ 4 వీసా రద్దు చేస్తాం – ట్రంప్
హెచ్-4 వీసా వర్క్ పర్మిట్ రద్దు ప్రక్రియకు సంబంధించిన పనులు తుది దశకు చేరుకున్నట్లు ట్రంప్ ప్రభుత్వానికి చెందిన ఓ అధికారి యూఎస్ న్యాయస్థానానికి తెలియజేశారు. అమెరికాలో హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములు ఈ హెచ్-4 వీసా ద్వారా వివిధ కంపెనీల్లో పని చెయ్యొచ్చు. ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానాన్ని రద్దు చేసే యోచనలో ట్రంప్ ప్రభుత్వం ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హెచ్-4 వీసాను రద్దు చేయడం వల్ల దాని ప్రభావం దాదాపు 70వేల మందిపై పడుతుందని హెచ్-1బీ వీసాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అమెరికా న్యాయస్థానం డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్)ని వివరణ కోరింది. హెచ్-4వీసా వర్క్ పర్మిట్ రద్దు ప్రతిపాదన ప్రక్రియ తుది దశకు చేరిందని, జూన్‌లో దీనికి సంబంధించి క్లియరెన్స్ వస్తుందని డీహెచ్ఎస్ న్యాయస్థానానికి తెలియజేసింది. డీహెచ్ఎస్ దగ్గర నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత దాన్ని ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్‌కు పరిశీలన నిమిత్తం పంపిస్తామని ట్రంప్ యంత్రాంగం కోర్టుకు తెలియజేసింది.













