టెక్సాస్‌లో గాంధీ విగ్రహానికి తెలుగు ప్రముఖుల నివాళి
అమెరికాలో ప్రస్తుతం పర్యటిస్తున్న మాతృరాష్ట్రం నుంచి వచ్చిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు డల్లాస్‌లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం ఉన్న ప్రాంతాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎంజీఎంఎన్టీ) చైర్మన్ తోటకూర ప్రసాద్ ఆధ్వర్యంలో సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ వీ.దుర్గాభవాని, ప్రఖ్యాత కూచిపూడి డాన్సర్ కేవీ సత్యనారాయణ టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లో ఉన్న గాంధీజీ విగ్రహాన్ని జులై 9న సందర్శించారు. అందమైన సరస్సు పక్కనే గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, దాన్ని తాము సందర్శించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని వందేమాతరం శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
టెక్సాస్‌లో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఎంజీఎంఎన్టీ చైర్మన్ ప్రసాద్ తోటకూర, సెక్రటరీ రావు కాల్వల, విగ్రహాన్ని రూపొందించిన శిల్పి బుర్రా వరప్రసాద్ కృషిని మర్చిపోలేమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గాంధీజీపై ఓ పాటను ఆలపించారు. అమెరికాలో భారత జాతిపిత గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్నారైలకు నాయకత్వం వహించిన ప్రసాద్ తోటకూరపై వీ.దుర్గాభవాని ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపచం వ్యాప్తంగా అమెరికాకు వస్తున్న వారు గాంధీజి విగ్రహం ద్వారా స్ఫూర్తిని పొందుతున్నారని ఆమె అన్నారు. తిరుపతిలో శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయంలో గాందీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రసాద్ తోటకూర స్వయంగా 8 లక్షల రూపాయలను విరాళంగా ఇవ్వడాన్ని ఆమె గుర్తు చేశారు. శాంతికోసం తన ప్రాణాలను త్యాగం చేసిన గాంధీ విగ్రహాన్ని అమెరికాలో ఏర్పాటు చేయడం సంతోషకరమని నంది అవార్గు గ్రహీత, కూచిపూడి డాన్సర్ కేవీ సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.













