అమెరికా పర్యటనలో మోదీ బిజీబిజీ ..పలువురు ప్రముఖులతో సమావేశం
అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం లభించింది. అమెరికా వాణిజ్య నగరంలోకి అడుగు పెట్టిన మోదీకి భారత రాయబార కార్యాలయ సిబ్బంది, ప్రవాస భారతీయులు సాదర స్వాగతం పలికారు. అనంతరం మోదీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోజంతా బిజీ బిజీ షెడ్యూల్‌తో గడిపారు. తొలుత ప్రధాన మంత్రి టెస్లా అధినేతతో పాటు, నోబెల్ బహుమతి గ్రహీత పాల్ రోమర్, ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డీ గ్రాస్ టైసన్ వంటి వ్యాపార వేత్తలతోనూ సమావేశమయ్యారు. హెల్త్‌కేర్, టెక్, ఎడ్యుకేషన్ రంగాలలోని నిపుణులతో కూడా సమావేశమయ్యారు. నగరాల సుస్థిర అభివృద్ధి, ప్రజా అనుకూల నగరాలుగా మార్చే విషయంపై నోబుల్ బహుమతి గ్రహీత పాల్ రోమర్‌తో ప్రధాని చర్చించారు. ఇందుకు టెక్నాలజీని ఎలా వినియోగించాలన్నదానిపై చర్చించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. రోమర్ ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్‌గా పని చేశారు. ప్రముఖ రచయిత, ఇన్వెస్టర్ రేమండ్ థామస్ డాలియోతో సమావేశమైన మోదీ దేశం లో పెట్టుబడులు మరింత పెంచాలని కోరారు. ప్రభుత్వం లో సంస్కరణల గురించి కూడా ఆయనతో చర్చించినట్లు మోదీ తెలిపారు. రేమండ్ బ్రిడ్జ్ వాటర్ ఇన్వెస్ట్మెంట్ సంస్థను నడిపిస్తున్నారు. 1975లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది.













