సర్జికల్ దాడులతో మన సత్తా తెలిసింది
భద్రత కోసం వేరొకరిపై ఆధారపడాల్సిన పనిలేదని.. అవసరమైతే మనదేశం తన కాళ్లపై తాను నిలబడగలదని చెప్పేందుకు సర్జికల్ దాడులే ప్రబల సాక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. వాషింగ్టన్ డీసీ వేదికగా భారతీయులను ఉద్దేశించి ఉత్తేజపూరితంగా ప్రసంగించారు. భారత సైనికుల పరాక్రమాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నియంత్రణ రేఖ పొడవునా మాటువేసిన ఉగ్రవాద శిబిరాలను గతేడాది సర్జికల్ దాడులతో మట్టుబెట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అదే సమయంలో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించాలన్న సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పామన్నారు. సర్జికల్ దాడులపై ఒక్క దేశం కూడా భారత్‌ను ప్రశ్నించలేదన్నారు. ‘‘ మిమ్మల్నందరినీ కలవడం నా సోంత కుటుంబ సభ్యులను కలిసినట్టుగా ఉంది. ఈ కార్యక్రమంలో నేను మినీ భారత్, మినీ అమెరికాలను చూస్తున్నాను. అన్ని రాష్ట్రాల ప్రజలూ ఇక్కడ ఉన్నారు. మీరు భారతదేశాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు గానీ.. భారత్‌లో ఏ మంచి జరిగినా మీరు పండగ చేసుకుంటారు. చెడు జరిగినప్పుడు మీరూ బాధపడతారు’’ అన్నారు. ప్రధాని ప్రసంగానికి ప్రవాసభారతీయుల నుంచి ఉత్సహకరమైన స్పందన వచ్చింది.













