జో బైడెన్ దంపతులకు అరుదైన కానుకలిచ్చిన ప్రధాని మోదీ
అమెరికాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే కానుకలను అధ్యక్షుడు జో బైడెన్ దంపతులకు బహుకరించారు. శ్వేతసౌధంలో మోదీకి బైడెన్ దంపతులు కుటుంబ సభ్యుల మధ్య విందు ఏర్పాటు చేశారు. ఈ విందు సందర్భంగా ఇరువురు నేతలు కానుకలు ఇచ్చిపుచ్చుకున్నారు. భారతీయ సంప్రదాయంలో సహస్ర చంద్ర దర్శనం చూడడం అంటే జీవితంలో ఒక మైలు రాయి. అధ్యక్షుడు బైడెన్ వచ్చే నెలలో సహస్ర చంద్ర దర్శనం పూర్తి అవుతున్న అరుదైన సందర్భంగా ఎప్పటికీ గుర్తు ఉండిపోయేలా చందనం చెక్క బాక్స్‌ని ఇచ్చారు. దానిపై రాజస్థానీ కళాకారుడు డిజైన్ వేశారు. చందనం పెట్టే లోపల దృష్ట సహస్రచంద్రో అని రాసి ఉన్న ఒక పత్రం, విఘ్నాలను తొలగించే గణేశుడి వెండి ప్రతిమ, దీపం, దశదానాలు చేయడానికి వీలుగా చిన్న చిన్న వెండి పాత్రల్లో ధాన్యాలు, బెల్లం, వెన్న, వస్త్రం, వంటివి ఉంచి కానుకగా ఇచ్చారు. రెండు పున్నముల మధ్య 29.53 రోజులు ఉంటుంది. అలా వెయ్యి సార్లు చంద్రుడిని వీక్షించడానికి 29,530 రోజులు లేదంటే 80 ఏళ్ల 8 నెలలు పడుతుంది. అలా సహస్ర చంద్ర దర్శనం చేసుకున్న వ్యక్తిని భారతీయ సంప్రదాయంలో ఎంతో గౌరవిస్తారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడడానికి బైడెన్ వయసుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో అంత ఆయుష్షు భారత దేశంలో ఎంత గౌరవనీయమో తెలిపేలా మోదీ ఈ బహుమాన్ని ఇచ్చారు.













