ప్రధాని మోదీ పర్యటన జయప్రదం
హౌడీ మోదీ కార్యక్రమం మోదీ పర్యటనలో హైలైట్‌గా నిలిచింది. ఈ కార్యక్రమంలో 50 వేల మందికి పైగా భారతీయులు స్పందించిన తీరు, ఆయన ప్రసంగానికి అడుగడుగునా హర్షధ్వానాలు చేసిన తీరు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించిన తీరు, ఈ సభకు వైట్ హౌజ్ తరలి రావడమే కాక రిపబ్లికన్, డెమోక్రటిక్ ప్రతినిధులు ఇద్దరూ హాజరైన తీరు చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా జరిగింది. సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 27 వరకు అమెరికాలో నరేంద్ర మోదీ జరిపిన పర్యటన నాటి వివేకానందుడి పర్యటనను గుర్తు చేసింది. కాశ్మీర్‌పై పెద్దగా సమస్యలు ఎదురుకాకుండా మోదీ చేసిన దౌత్యం?ఘనవిజయమే అని చెప్పాలి. మరోవైపు పాక్ దుశ్చర్యలను ఎండగట్టేందుకు ఈ పర్యటనను నరేంద్ర మోదీ సమర్థవంతంగా వినియోగించుకున్నారు. తాను ప్రసంగించిన అన్నీ చోట్లా భారత్ వైఖరిని చెబుతూనే, మరోవైపు దాయాది దేశం పాక్ చేస్తున్న దుశ్చర్యల వల్ల వస్తున్న అనర్థాలను ఆయన తెలియజేశారు. అంతర్జాతీయ సమూహాన్ని భారత్‌వైపు నిలబడేలా కృషి చేశారు.
తన పర్యటనలో తన అద్భుతమైన ప్రసంగాలు, విలక్షణ హావభావాల ద్వారా మోదీ అమెరికా ప్రజలు, ప్రవాస భారతీయుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. దౌత్యపరంగా, ఆర్థిక ఫలితాలపరంగా ఈ పర్యటన విజయవంతమైందనే చెప్పవచ్చు. ఐక్యరాజ్య సమితి 74వ సదస్సులో స్వచ్ఛమైన హిందీ ప్రసంగంలో భారతీయ సంస్కతి ఔన్నత్యాన్ని సమున్నతంగా వివరించిన మోదీ ఉగ్రవాదంపై సమష్టి పోరాటం ఆవశ్యకత, ప్రజలకు సాధికారత కల్పించడం, పర్యావరణ పరిరక్షణ, ప్రజా ఆరోగ్యం, పరిశుభ్రత వంటి మొత్తం ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్న అంశాలపై మాట్లాడి ఒక అంతర్జాతీయ స్థాయి నాయకుడని ప్రపంచంలో నెలకొన్న అభిప్రాయాన్ని ధ్రువీకరించారు. వివిధ వ్యాపార సంస్థల సిఇఓలు, ప్రధాన ఇంధన సంస్థల ప్రతినిధులతో సమావేశమై 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రత, పెట్టుబడుల అవకాశాల గురించి మాట్లాడినప్పుడు వారు అత్యుత్సాహంతో స్పందించారు. బ్లూమ్‌బర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోర్లో విదేశీ పెట్టుబడులకోసం మోదీ ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో కీలక చర్చలు జరిపారు. అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులను ఆయన భారత దేశానికి ఆహ్వానించారు. స్మార్ట్ సిటీలను పెంపొందించి మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు ప్రవహించేందుకు వీలు కల్పించినట్లు చెప్పారు.
న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి వాతావరణ కార్యాచరణ సదస్సులో మోదీ మాట్లాడడానికి ఉపక్రమిస్తుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ ప్రసంగం వినడానికి స్వయంగా హాజరవ్వడం విశేషం. ప్రకతి వైపరీత్యాల నివారణకు మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సంఘటితంగా కషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చేందుకు తీసుకుంటున్న చర్యల్ని పేర్కొన్నారు. న్యూయార్క్‌లోని సార్వత్రిక ఆరోగ్య సంక్షేమ చర్యలపై జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో అందరికీ భరించదగ్గ రీతుల్లో ఆరోగ్య చికిత్సా వ్యవస్థల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే ప్రపంచం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు. మొట్టమొదటి సారి పసిఫిక్ దేశాల సమావేశంలో అభివద్ధి ప్రాధాన్యతల గురించి చర్చించారు. ఐక్యరాజ్య సమితికి గాంధీ సోలార్ పార్క్‌ను బహూకరించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ పెద్ద ఎత్తున అమలు చేస్తున్నందుకు ప్రధానమంత్రికి గేట్స్ ఫౌండేషన్ ‘గ్లోబల్ గోల్ కీపర్’ అవార్డును అందుకున్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఐరాసలో సమకాలీన ప్రపంచంలో గాంధీ ప్రాముఖ్యత గురించి మోదీ ప్రసంగించారు. మోదీ అమెరికా పర్యటన గతంలో కన్నా ఈసారి ప్రత్యేకతలతో సాగడం విశేషం.
2014లో ఆయన తొలుత అమెరికాలో అడుగుపెట్టి సాధారణ అసెంబ్లీలో ప్రసంగించిన నాడు ఉన్న పరిస్థితులకూ ఇప్పటి పరిస్థితులకూ ఎంతో తేడా కనిపించింది. ఈ అయిదేళ్లలో భారత దేశం పట్ల ప్రపంచ దష్టి పూర్తిగా మారేలా మోదీ చేసిన దౌత్యం ఫలించిందనే చెప్పాలి.
హౌడీ మోదీలో ప్రధాని నరేంద్రమోదీ ఉగ్రవాదంపై పోరుకు కదలాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై, ఉగ్రవాదానికి ఊతమిస్తున్న, ఆర్థిక మద్దతిస్తున్న దేశాలపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రకటించారు. ఆ యుద్ధానికి డొనాల్డ్ ట్రంప్ కచ్చితంగా మద్దతిస్తారని, ఆయనే ముందుండి నడుపుతారని తెలిపారు. ఉగ్రవాదంపై అలుపెరగని పోరాటం చేస్తున్న ట్రంప్‌ను నిలుచుని చప్పట్లు కొడుతూ ప్రశంసించాలని ఆహూతులను కోరారు.
దాదాపు అరగంట పాటు సాగిన ప్రసంగంలో ఇప్పటివరకు ఐదేళ్ల తమ పాలన సాధించిన విజయాలను మోదీ ఏకరువు పెట్టారు. 60 ఏళ్లలో సాధించలేని వాటిని ఐదేళ్లలో సాధించగలిగా మన్నారు. స్నేహితుడంటూ ఆహూతులకు పరిచయం చేశారు. అనంతరం ట్రంప్ ప్రసంగించారు. అమెరికా అభివద్ధిలో భారతీయ అమెరికన్ల పాత్ర ఎంతో ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలోని దాదాపు 4 మిలియన్ల భారతీయులపై తనకెంతో గౌరవం ఉందన్నారు. ‘వి..ద పీపుల్’ అనే వాక్యంతోనే భారత్, అమెరికాల రాజ్యాంగ పీఠిక ప్రారంభమవుతుందని, ఇదే ఇరు దేశాల ఉమ్మడి లక్ష్యాలకు రుజువని పేర్కొన్నారు. ట్రంప్ ప్రసంగ సమయంలో ‘యూఎస్ఏ.. యూఎస్ఏ’ అంటూ ప్రేక్షకులు నినదించడం విశేషం. ట్రంప్ ప్రసంగం అనంతరం మోదీ మరోసారి కీలక ప్రసంగం చేశారు. మోదీ తన మొదటి ప్రసంగాన్ని ఇంగ్లీష్‌లో, తదుపరి ప్రసంగాన్ని హిందీలో చేయడం విశేషం.
ఐక్యరాజ్యసమితిలో మోదీ చేసిన ప్రసంగం
ఉగ్రవాదం ఏ ఒక్క దేశం సమస్యో కాదని.. ప్రపంచ దేశాలన్నింటికీ అది సవాలుగా మారిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఒక్కటిగా నిలవాలని పిలుపునిచ్చారు. ఐరాస సాధారణ సభ 74వ సమావేశాలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. హిందీలో 20 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో వాతావరణ మార్పులు, అభివద్ధి దిశగా భారత్ తీసుకున్న చర్యలు, ముఖ్య పథకాలు, ఆధునిక సాంకేతికత ప్రభావం.. తదితరాలను ప్రస్తావించారు.
మహాత్ముడి 150వ జయంతి ఉత్సవాలను ప్రపంచమంతా జరుపుకుంటున్న ఈ సంవత్సరంలో.. ఐరాస నిర్వహిస్తున్న ఈ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ‘భారత్ ప్రపంచానికి యుద్ధాన్ని ఇవ్వలేదు.. బుద్ధిని ఇచ్చింది. శాంతి, అహింసల సందేశాన్ని ఇచ్చింది’ అని పేర్కొన్నారు.
వాతావరణ మార్పుపై మోదీ
వాతావరణ మార్పు ప్రతికూల ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రకతి విపత్తుల సంఖ్య, విధ్వంస స్థాయి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రకతి విపత్తులను తట్టుకునే మౌలిక వసతుల కల్పన కోసం భారత్ ‘కొయలిషన్ ఫర్ డిజాస్టర్ రెజిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ను ఏర్పాటు చేసింది. వాతావరణ మార్పు ప్రతికూలతలపై సాగుతున్న పోరులో భారత్ పాత్ర కీలకం. ఇతర దేశాలతో పోలిస్తే అతి తక్కువ స్థాయిలోనే గ్రీన్‌హౌజ్ వాయువులను విడుదల చేస్తున్నప్పటికీ.. వాతావరణ కాలుష్యంపై భారత్ పోరాటం గణనీయం అని మోదీ చెప్పారు.
బ్లూమ్‌బర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం సదస్సులో…
భారత్‌లో కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మక అడుగు అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రగతికి ఆటంకాలు కలిగించే 50 చట్టాలకు స్వస్తి పలికామని పేర్కొన్నారు. న్యూయార్క్‌లో జరిగిన బ్లూమ్‌బర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం సదస్సులో ఆయన మాట్లాడారు. భారత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని అమెరికా పారిశ్రామిక వర్గాలను కోరారు. పెట్టుబడులకు భారత్ అనుకూల దేశమని.. భారత్‌తో వాణిజ్య, వ్యాపారాల్లో భాగస్వామ్యం కావడం సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. ‘ మీ కలలు, ఆశయాలకు భారత్ గమ్యస్థానం. మీ సాంకేతికతకు మా ప్రతిభను జోడిస్తే ప్రపంచాన్ని మార్చవచ్చు. మీ మెళకువలు- మా నైపుణ్యాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తాయి. వీటన్నింటికీ నేను వారధిగా ఉంటాను’ అని మోదీ పిలుపునిచ్చారు.













