ప్రపంచ దేశాలకు అది సవాలుగా మారింది : మోదీ
ఉగ్రవాదం ఏ ఒక్క దేశం సమస్యో కాదని, ప్రపంచ దేశాలన్నింటికీ అది సవాలుగా మారిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఒక్కటిగా నిలవాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి ఆవిర్భావానికి పునాదులుగా నిలిచిన సైద్ధాంతిక భూమికను సైతం ఉగ్రవాదం ధ్వంసం చేస్తోందని, మానవాళికి ఈ మహమ్మారి శాపంగా పరిణమించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడం బాధకరమన్నారు. ఐరాస సాధారణ సభ 74వ సమావేశాలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. హిందీలో 20 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో వాతావరణ మార్పులు, అభివృద్ధి దిశగా భారత్ తీసుకున్న చర్యలు, ముఖ్య పథకాలు, ఆధునిక సాంకేతికత ప్రభావం తదితరాలను ప్రస్తావించారు.
మహాత్ముడి 150వ జయంతి ఉత్సవాలను ప్రపంచమంతా జరుపుకుంటున్న ఈ సంవత్సరంలో.. ఐరాస నిర్వహిస్తున్న ఈ సమాశాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. భారత్ ప్రపంచానికి యుద్ధాన్ని ఇవ్వలేదు.. బుద్ధిని ఇచ్చింది. శాంతి, అహింసల సందేశాన్ని ఇచ్చింది అని పేర్కొన్నారు. ఐరాస వేదికపై మోదీ ఇది రెండవ ప్రసంగం. గతంలో 2014లో ఇక్కడ ఆయన ప్రసంగించారు. 1996లో ఐరాసలో ఉగ్రవాదంపై సమర్పించిన నివేదిక దేశాలు ఏకాభిప్రాయానికి రాలేదు.













