కరోనా నివారణలో ట్రంప్ విఫలం : ఒబామా
కరోనాపై వార్తలు ఇస్తున్నాయనే మీడియాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కసు పెంచుకున్నారని మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా ఆరోపించారు. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్జి జో బైడెన్ తరపున ఆయన ఫ్లోరిడా రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓర్లాండో సిటీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ కరోనా నివారణలో ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. శ్వేతసౌధాన్నే హాట్ జోన్‌గా మార్చారని ఆరోపించారు. ముందే జాగ్రత్త పడి ఉంటే కేసులు ఈ స్థాయిలో పెరిగి ఉండేవి కావని అన్నారు. బైడెన్ అధ్యక్షుడయితే వ్యాధి నిర్ధరణ పరీక్షల్లో నిర్లక్ష్యం చేయరు. శాస్త్రవేత్తలను ఇడియట్స్ అని తిట్టరు. వ్యాధి విస్తరణకు అవకాశం కలిగించే కార్యక్రమాలను శ్వేత సౌధంలో నిర్వహించరు. దేశమంతటా తిరిగి అందరికీ అంటగట్టరు అని వ్యాఖ్యానించారు. చైనా, ఉత్తర కొరియా, రష్యా దేశాలు తాను మళ్లీ గెలవాలని కోరుకుంటున్నట్టు ట్రంప్ చెబుతున్నారని అన్నారు.













