నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థికి అమెరికాలో ఏడాదికి కోటి జీతం
నూజివీడు ట్రిపుల్ ఐటీలో 2008-14 సంవత్సరాల మధ్య చదివిన మొదటి బ్యాచ్ విద్యార్థి ఆడారి మణికుమార్ అమెరికాలోని అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్‌గా ఏడాదికి రూ.కోటికి పైగా వేతనంతో ఉద్యోగాన్ని సాధించారు. విశాఖ జిల్లా మారుమూల గ్రామం నుంచి అమెరికాలో ఆకర్షణీయ ఉద్యోగం వరకు సాగిన మణికుమార్ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. విశాఖ జిల్లా చింతలగ్రహారం గ్రామానికి చెందిన ఆడారి రాము, మీనాక్షి దంపతుల ఏకైక కుమారుడు మణికుమార్. ఇతనికి ఇద్దరు తోబుట్టువులు. అదే గ్రామంలోని హైస్కూల్లో 2008లో పదో తరగతిలో 600కు గాను 548 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు దక్కించుకున్నారు. చదువుకుంటున్న రోజుల్లోనే ప్రముఖ ప్రోగ్రామింగ్ వెబ్సైట్లను అనుసరిస్తూ అల్గారిథమ్ సమస్యలకు పరిష్కారాలు కనుగోనే నైపుణ్యాన్ని సంపాదించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పట్టు సాధించాడు. మణికుమార్ బీటెక్‌లో మూడో సంవత్సరంలో ఉండగానే అమెజాన్ మిషన్ లెర్నింగ్‌లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు.
బీటెక్ పూర్తయిన తర్వాత ఒక స్టార్టప్ కంపెనీలో ఏడాదికి రూ.8 లక్షల వేతనానికి చేరారు. దాన్ని స్నాప్‌డీల్ సంస్థ కొనుగోలు చేసింది. కొద్దికాలం అందులో పనిచేసి అతనికి 2015లో అమెజాన్ సంస్థలో అవకాశం వచ్చింది. అమెజాన్‌కు ఇండియాలో రెండేళ్లు పనిచేశారు. అప్పట్లో ఏడాదికి రూ.18 లక్షల వేతనం అందుకునేవారు. తర్వాత ప్రమోషన్‌తో పాటు అదే కంపెనీకి అమెరికాలో పనిచేసే అవకాశం వచ్చింది. అమెరికాలో ఏడాదికి రూ.40 లక్షల వేతనంతో ఉద్యోగంలో చేరారు. రెండేళ్లు పనిచేశాక ప్రస్తుతం వేతనం రూ.కోటి దాటింది.













