లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
లాస్ ఏంజెల్స్‌లో మే 28న విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు శరత్ కామినేని నివాసంలో నందమూరి సజీవ శిల్పం దగ్గర ఘనంగా జరిగాయి. సినీ నటులు మాగంటి మురళీమోహన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజకీయ పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా జరిగిన ఈ వేడుకలకు ఎన్టీఆర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి నటుడు మురళీ మోహన్ జ్యోతి ప్రజ్వలన, పూలమాలతో నివాళులు అర్పించారు. ఆడపడుచులు హారతులిచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇండియా నుండి జూమ్ ద్వారా పురంధరేశ్వరి మాట్లాడుతూ, ఎన్టీఆర్ అభిమానులందరు తమ ఆత్మ బంధువులంటూ తండ్రితో తనకు ఉన్న అనుబంధాన్ని ఆత్మీయతను గుర్తు చేసుకున్నారు. ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్, వై.వీ.ఎస్.చౌదరి తదితరులు కూడా ఎన్టీఆర్‌తో తమకు ఉన్న అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. మురళి మోహన్ మాట్లాడుతూ ఎన్టీఆర్‌తో తనకు ఉన్న బంధం.. అన్నదమ్ముల అనుబంధం అంటూ తన సినీ రాజకీయ ప్రస్థానాన్ని, అనుభవాలను చెబుతుంటే అభిమానులు మంత్రముగ్ధులైపోయారు. ఆయన ప్రసంగం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అదే విధముగా ఈ కార్యక్రమములో రాజలక్ష్మి చిలుకూరి మాట్లాడుతూ ఆడపడుచులకు ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. మధు బోడపాటి, నందన్, ప్రసాద్ పప్పుదేశి, కరుణాకర్ రాంభట్ల, సంపత్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుజాతికి, తెలుగు భాషకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని తెచ్చిన విధానాన్ని మననం చేశారు. అనంతరం శరత్ కామినేని ఆధ్వర్యములో సినీ నటులు మాగంటి మురళీమోహన్ ముఖ్య అతిథిగా, పిల్లలు పెద్దలు అందరూ కలిసి లాస్ ఏంజెల్స్ డౌన్ టౌన్, కోస్తామిస, సాన్ ఫెర్నాండో వ్యాలీ పట్టణాలలో సుమారు 1000 మంది నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చివరగా శరత్ కామినేని ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి కృషి చేసిన వాలంటీర్స్ అందరికి పేరు పేరునా ధన్యవాదములు తెలిపారు.













