అమెరికా తప్పుడు ప్రచారం : ఉత్తర కొరియా
కొరియా ద్వీపకల్పంలో పూర్తిస్థాయి శాంతి నెలకొల్పే దిశలో ఏర్పడ్డ సామరస్య వాతావరణాన్ని అమెరికా చెడగొడుతోందని ఉత్తర కొరియా ఆరోపించింది. ఈ నెలాఖరు లేదా జూన్ ఆరంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య చారిత్రక సమావేశం జరగడానికి ముందు శ్వేతసౌధంపై ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంతకాలం క్రితం వరకు వరుస అణుపరీక్షలు, అణుదాడి హెచ్చరికలతో అందరినీ భయభ్రాంతులకు గురిచేసిన కిమ్ సర్కార్ తాము తెచ్చిన రాజకీయ ఒత్తిళ్లు, విధించిన ఆంక్షల కారణంగానే శాంతి చర్చలు జరిపేందుకు అంగీకరించిందంటూ అమెరికా తప్పుడు ప్రచారం చేస్తోందని ఉత్తర కొరియా దుయ్యబట్టింది. ఏప్రిల్ 27న దక్షిణకొరియా అధ్యక్షుడు ఉత్తరకొరియా అధినేత మధ్య జరిగే చారిత్రక చర్చల అనంతరం ఏర్పడ్డ సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసేలా అమెరికా ప్రకటనలు ఉన్నాయని కిమ్ సర్కార్ ధ్వజమెత్తింది. శాంతి స్థాపనలో దిశలో ఉభయ కొరియాలు అడుగుల వేస్తుంటే అమెరికా కావాలనే తమను రెచ్చగొడుతోందని ఉత్తర కొరియా మండిపడింది.













