కమలా హారిస్ కు పోటీగా నిక్కీ హేలీ రంగంలోకి
అమెరికా అధ్యక్ష ఎన్నికలను రెండోసారి ఎదుర్కోనున్న డొనాల్డ్ ట్రంప్ తమ పార్టీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించడం ప్రారంభించారు. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు సౌత్ కరోలినా మాజీ గవర్నర్, యునైటెడ్ నేషన్స్ మాజీ ప్రతినిధి నిక్కీ హేలీని ప్రమోట్ చేయాలని ట్రంప్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. డెమోక్రాట్లు ఉపాధ్యక్ష పదవికి భారత సంతతి మహిళ కమలా హారిస్‌ను ఎంపిక చేసి, ఆమెనే 2024 అధ్యక్ష ఎన్నికల్లో తమ తరపున నిలపాలని భావిస్తున్న వేళ, భారత సంతతి మూలాలు ఉన్న నిక్కీ హేలీ అయితే గట్టి పోటీ ఉంటుందని, గెలుపు అవకాశాలు కూడా ఉంటాయని రిపబ్లికన్లు భావిస్తున్నారని తెలుస్తోంది. దీంతో 2024లో అమెరికా అధ్యక్ష పదవికి భారత మూలాలు ఉన్న ఇద్దరు మహిళలు పోటీ పడేందుకు ఇప్పుడే అడుగులు పడినట్లు అయింది.
ఇండియాలోని సిక్కుల మూలాలు ఉన్న నిక్కీ హేలీ గతంలో సౌత్ కరోలినా గవర్నర్‌గా పని చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన నేషనల్ కన్వెన్షన్‌లో ఆమె ప్రసంగానికి మంచి స్పందన వచ్చింది. అధ్యక్షుడు ట్రంప్ కూడా అమెను మెచ్చుకున్నారు. ఈ వర్చ్యువల్ సమావేశంలో నిక్కీ మాట్లాడుతూ అమెరికాలో జాత్యహంకారం ఉందని చెప్పడం అవాస్తవం. నా వరకూ నన్నే తీసుకొండి. వారు అమెరికా వచ్చిన చిన్న పట్టణంలో స్థిరపడ్డారు. నా తండ్రి టర్బరన్ ధరిస్తారు. నా తల్లి చీర కట్టుకుంటుందన్నారు.
ఈ సమావేశం తరువాత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉత్తర, దక్షిణ భారతాలు పోటీ పడనున్నాయని తెలుస్తోంది. కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ తమిళనాడుకు చెందిన మహిళ కాగా, నిక్కీ హేలీ తల్లిదండ్రులు అజిత్ సింగ్ రణ్‌ధావా, రాజ్ కౌర్ అమృతసర్‌కు చెందిన వారు. 2024లో లేదా 2028లో రిపబ్లికన్ల తరపు అధ్యక్ష పదవికి నిక్కీ హేలీ బరిలోకి దిగుతారని అంచనా వేస్తున్నట్లు యూసీ రివర్ సైడ్ పొలిటిక్ సైన్స్ ప్రొఫెసర్ కార్తీక్ రామకృష్ణన్ వ్యాఖ్యానించారు.













