అమెరికాలో పెరుగుతున్న భారతీయ విద్యార్థులు
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు భారత విద్యార్థులు అమితాసక్తి చూపుతున్నారు. గత పదేండ్లలో అమెరికాకు వెళ్లి చదువుకుంటున్నవారి సంఖ్య రెట్టింపు కావడమే ఇందుకు నిదర్శనం. గత ఏడాది అమెరికాకు వెళ్లిన భారత విద్యార్థుల సంఖ్య 1.86 లక్షలు కాగా, ఈ ఏడాది అది 5.4 శాతం పెరిగి 1.96 లక్షలకు చేరిందని ఓపెన్ డోర్స్ అనే సంస్థ వెల్లడించింది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్తున్న భారతీయుల సంఖ్య పెరుగడం వరుసగా ఇది ఐదోసారి. గత పదేండ్లలో అమెరికాకు వచ్చిన భారత విద్యార్థుల సంఖ్య రెట్టింపయ్యిందని యూఎస్ మంత్రి జోసెఫ్ పాంపర్ ఇటీవల ఓ విద్యా సదస్సులో చెప్పారు. ఉన్నత ప్రమాణాలు గల విద్య కోసం భారతీయులు వెతుకుతున్నారని, అది అమెరికాలో లభిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఓపెన్డోర్స్ నివేదిక ప్రకారం అమెరికాలో చదువుకొనే అంతర్జాతీయ విద్యార్థులలో చైనా మొదటి స్థానంలో ఉండగా, 18 శాతం మంది విద్యార్థులతో భారత్ రెండో స్థానంలో ఉంది. మరో వైపు భారత్లో చదువుకొనే అమెరికన్ విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది 12.5 శాతం పెరిగింది. ప్రస్తుతం 4,704 మంది అమెరికన్ విద్యార్థులు దేశంలోని వివిధ యూనివర్సిటీలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.













