టెంపాలో నాట్స్ సోషల్ మీడియా సెమీనార్ కు మంచి స్పందన
యువతపై సోషల్ మీడియా ప్రభావాన్ని వివరించిన నిపుణులు
అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న నాట్స్ ఈ సారి విద్యార్ధులు, యువతకు అత్యంత కీలకమైన సోషల్ మీడియా అంశంపై సెమీనార్ నిర్వహించింది. టెంపాలో నిర్వహించిన ఈ సెమీనార్ కు స్థానికంగా ఉండే తెలుగు యువతీయువకులు విచ్చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు. సోషల్ మీడియా దుష్ప్రభావాల గురించి నిపుణులు మార్టిన్ స్పెన్సర్ ఈ సదస్సులో వివరించారు. యువత సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలనే దానిపై సూచనలు చేశారు. సోషల్ మీడియాకు బానిస కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ఇదే సదస్సులో కాలేజీల్లో చేరబోయే విద్యార్ధులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు, పాటించాల్సిన సూత్రాలపై విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు రజితా నిడదవోలు దిశా నిర్థేశం చేశారు. ఇప్పటివరకు పాఠశాలల్లో సాధించిన విద్యా సంబంధ విషయాలతో పాటు ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో పోషించిన పాత్ర, నాయకత్వ లక్షణాలను ప్రదర్శించిన సందర్భాలు వీటినన్నింటిని చెక్ లిస్ట్ తయారు చేసుకోవాలని సూచించారు. విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు కాలేజీ విద్య పై అడిగిన అనేక ప్రశ్నలకు రజితా సమాధానాలిచ్చారు. వారికి విలువైన సూచనలు చేశారు. నాట్స్ టెంపా బే సమన్వయకర్త రాజేశ్ కందురు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు స్థానిక తెలుగు వారు హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. తమకు తెలియని ఎన్నో అంశాలను నాట్స్ నిర్వహించిన సదస్సు ద్వారా తెలుసుకున్నామని ఈ సందర్భంగా వారు నాట్స్ కు ధన్యవాదాలు తెలిపారు.













