రానున్న ఐదేళ్లలో సాధిస్తామన్న అమెరికా
రానున్న ఐదేళ్లలో అమెరికన్ వ్యోమగాములతో మరోసారి చంద్రగ్రహ యాత్రను నిర్వహిస్తామని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రకటించారు. 1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ నేతృత్వంలోని వ్యోమగాముల బృందం తొలిసారిగా చంద్రగ్రహంపై కాలుమోపిన విషయం తెలిసిందే. అలబామాలోని హంట్స్‌విల్లెలోని మార్షల్ స్పేస్‌ఫ్లైట్ సెంటర్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రగ్రహయాత్ర ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేపట్టడానికి సిద్దమన్నారు. ప్రచ్ఛన్న యుద్ద కాలంలో చేపట్టిన రోదసీ పోటీలో తాము ఇప్పటికీ కొనసాగుతున్నామని చెప్పారు. 2020లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి విజయం సాధించే లక్ష్యంతోనే ట్రంప్ సర్కారు ఈ కార్యక్రమాన్ని ప్రకటించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రోదసీ రంగంలో చైనా, రష్యా నుండి ఎదురవుతున్న పోటీని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు అభిప్రాయపడుతున్నారు.













