జన్మత: పౌరసత్వం రద్దు! … లక్షల కుటుంబాల్లో ఆందోళన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆ దేశానికి వలస వచ్చిన వారికి వ్యతిరేకంగా తన అక్కసును వెళ్లగక్కారు. అమెరికా గడ్డపై పుట్టిన ఇతర దేశాలకు చెందిన వారి సంతానంపై ఇప్పుడు ఆయన కన్ను పడింది. వారికి జన్మత: లభించే అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు ఆయన సిద్ధపడుతున్నారు. అక్రమ వలసలను అరికట్టే పేరుతో అమెరికాకు వలస వచ్చిన వారికి ట్రంప్ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. పౌరసత్వంపై ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు కూడా లక్షల కుటుంబాలకు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ట్రంప్ వ్యాఖ్యలు కార్యరూపం దాలిస్తే అమెరికాలో పుట్టిన అనేక దేశాల చిన్నారులకు ఆ దేశ పౌరసత్వం లభించడం ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంది. ట్రంప్ శ్వేతసౌధం వెలుపల మాట్లాడుతూ సరిహద్దులు దాటి వస్తున్నారు. బిడ్డలకు జన్మనిస్తున్నారు. ఆ పిల్లలకు ఇక్కడ పౌరసత్వం లభిస్తోంది. ఇది హాస్యాస్పదం. జన్మత: పౌరసత్వం రద్దు చేసే విషయంపై మేము తీవ్రంగా ఆలోచిస్తున్నాం అని ప్రకటించారు.













