డ్రై ఫ్రూట్స్‌తో ఊబకాయం దూరం!
బాదం, పిస్తా, అక్రోట్లు, వేరుసెనగ లాంటి పప్పు గింజలను ఆహారంలో కలిపి తీసుకుంటే ఊబకాయ ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది. బరువు తగ్గడంలోనూ ఇవి సహకరిస్తాయని బయటపడింది. అమెరికాలోని లోమా లిండా వర్సిటీ నిపుణులు దీన్ని చేపట్టారు. పది ఐరోపా దేశాలకు చెందిన 25 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న 3,73,000 మంది సమాచారాన్ని వారు విశ్లేషించారు. ఐదేళ్లలో వీరు సగటున 2.1 కేజీల బరువు పెరిగినట్లు గుర్తించారు. అయితే వీరిలో పప్పు గింజలు ఎక్కువగా తీసుకున్నవారు మిగతావారికంటే బరువు తక్కువగా ఉన్నట్లు బయటపడింది. అంతేకాదు వీరిలో ఊబకాయ మప్పు సైతం మిగతావారికంటే ఐదు శాతం తక్కువగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. పప్పు గింజలతో వయసు మళ్లిన ఛాయలు తగ్గడం, మెదడు పనితీరు మెరుగుపడటం లాంటి ప్రయోజనాలు చేకూరతాయని ఇదివరకటి పరిశోధనల్లోనే తేలింది.













