ఘనంగా జరిగిన లాటా మినీ ఒలింపిక్స్ ముగింపు ఉత్సవాలు
అమెరికాలోని లాస్ ఏంజల్స్ మహా నగరంలో లాస్ ఏంజల్స్ తెలుగు అసోసియేషన్ (లాటా) నిర్వహించిన మినీ ఒలింపిక్స్ ముగింపు ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా, 2016 ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ యాష్లీ జాన్సన్ ముఖ్య అతిధి గా వ్యవహరించి విజేతలందరికీ మెడల్స్ మరియు ట్రోఫీలు అందజేశారు. ఈ ముగింపు ఉత్సవాల్లో విజేతలు, కార్యకర్తలు, దాతలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ట్రోఫీలు ప్రధానం చెయ్యటంతో పాటు, లాటా కార్యకర్తల అభినందన దినోత్సవంగా కూడా జరుపుకున్నారు. స్థానిక కళాకారులు శ్రీమాన్ కొమరగిరి, రమ్య పుచ్చ వచ్చిన అతిథులని తమ ఆట పాటలతో ఉర్రూతలూగించారు.
ఎనిమిది క్రీడా పోటీలకు ఆరు చోట్ల లీగ్ మ్యాచులు, ప్రతి ఆటకూ ఫైనల్స్ తో కలిపి 6 వారాల పాటు ఈ పోటీలను నిర్వహించారు. పిల్లల నుంచి పెద్దల వరకూ దాదాపు 1100 మంది క్రీడాకారులు ఈ మినీ ఒలింపిక్స్లో పాల్గొన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి క్రీడా పోటీలను అమెరికాలో, ఒక తెలుగు సంస్థ నిర్వహించటం ఇదే మొదటి సారి అని ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు తెలియచేసారు. మే 26న మొదలైన ఈ క్రీడాపోటీలు జూలై 1న క్రికెట్ ఫైనల్స్ తో ముగిసాయి. క్రికెట్, వాలీబాల్, టెన్నిస్, టెన్నికోయిట్, చెస్, క్యారంస్, స్విమ్మింగ్, రన్నింగ్ క్రీడలను ఇర్వైన్, ఈస్ట్ వెల్, వాలెన్సియా, టోరెంస్, సైప్రస్, బర్ బ్యాంకు, బ్యుయనా పార్క్, ఆర్కేడియా నగరాల్లో నిర్వహించడం జరిగింది. 145 మంది కార్యకర్తలు ఈ పోటీలను పర్యవేక్షించారు.
యాష్లీ జాన్సన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ క్రీడల్లో పాల్గొని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందాలని పిలుపునిచ్చారు. ఆటల్లో అయినా, చదువుల్లో అయినా, జీవితం లో అయినా, చిన్న చిన్న లక్ష్యాలని సాధించటం ద్వారా ఎంత పెద్ద లక్ష్యం అయినా చేధించవచ్చు అని, తాను ఒలింపిక్స్లో బంగారు పథకం ఎలా సాధించారో వివరించారు.
దోసా ప్లేస్ అందించిన షడ్రుచుల తో కూడిన విందు భోజనం అందరినీ ఆకట్టుకుంది. మినీ ఒలింపిక్స్ ని ఔరా అనిపించే విధంగా విజయవంతం చేసిన ప్రతీ కార్యకర్తకూ, ప్రతీ క్రీడాకారునికి, దాతలకు ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు బోర్డు ఆఫ్ డైరెక్టర్స కృతజ్ఞతలు తెలియజేశారు. ూబస్త్రబర్ 4, 5 తేదీల్లో Scrum Certification Training అతి తక్కువ ఫీజుతో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. వివరాల కోసం www.latausa.org సంప్రదించండి.













