కాకర్ల సుబ్బారావు మృతి ఎన్నారైలతో పాటు తెలుగువారికి తీరని లోటు : కోమటి జయరాం
ప్రముఖ వైద్యులు, ఎన్నారై, తానా వ్యవస్థాపక అధ్యక్షులు కాకర్ల సుబ్బారావు మృతిపట్ల తానా మాజీ అధ్యక్షులు, ప్రముఖ ఎన్నారై జయరాం కోమటి సంతాపం తెలిపారు. సుబ్బారావుతో తనకున్న అనుబంధాన్ని జయరాం కోమటి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తనలాంటి వారెందరికో సుబ్బారావు మార్గదర్శి అని, ఆయన అడుగుజాడల్లో నడిచి తానా ను ఉన్నత శిఖరాలకు చేర్చడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఎన్నారైలతోపాటు స్వదేశంలోని తెలుగువారి కోసం సుబ్బారావు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. అమెరికా తెలుగు సంఘాలలో సానుకూల దృక్పథం రావాలని, కష్టపడే తత్వం పెరగాలని చెబుతుండేవారని గుర్తు చేశారు. వైద్యరంగంలో విశేష సేవలందించిన సుబ్బారావు మృతి ఎన్నారైలతో పాటు తెలుగు వారందరికీ తీరని లోటు అని అన్నారు. సుబ్బారావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.













