అమెరికా వీర మహిళ కల్పనాచావ్లా : ట్రంప్
అంతరిక్ష పరిశోధనల కోసం జీవితాన్ని అంకితం చేసిన భారత సంతతికి చెందిన వ్యోమగామి కల్పనాచావ్లా అమెరికా వీర మహిళ అని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. వ్యోమగాములు కావాలని లక్షల మంది బాలికల్లో ఆమె స్ఫూర్తి నింపారని ప్రశంసించారు. ఏటా మే నెలను ఆసియా-పసిఫిక్ అమెరికా వారసత్వ మాసంగా ప్రకటిస్తూ వాషింగ్టన్ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కల్పనాచావ్లా రోదసీలోకి వెళ్లిన తొలి భాతర సంతతి మహిళ అని, స్పేస్ షటిల్ సహా వేర్వేరు ప్రయోగాల కోసం ఆమె అంకిత భావంతో పనిచేశారని ట్రంప్ అన్నారు. 2003లో స్పేస్ షటిల్ కొలంబియా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కల్పనను అమెరికా చట్ట సభలతోపాటు నాసా అనేక పురస్కారాలతో మరణ అనంతరం గౌరవించాయని గుర్తు చేశారు. ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి వచ్చి అమెరికానే సొంత దేశంగా మార్చుకున్నవారి కారణంగా అగ్రరాజ్యం ఎంతో లాభపడిందని అన్నారు.













