తెలుగు భాష పరిరక్షణ అందరి బాధ్యత – జయరామ్ కోమటి
ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో ఒకటిగా ఉన్న తెలుగు భాషను పరిరక్షించే చర్యలు చేపట్టడంతోపాటు నేటితరం, రాబోయే తరాలు తెలుగు భాషను ఇష్టపడేలా ప్రోత్సహించేందుకు అందరూ నడుంబిగించాలని అమెరికాలో మొట్ట మొదటి తెలుగు పత్రిక తెలుగు టైమ్స్‌కు చైర్మన్‌గా ఉన్న జయరామ్కోమటి అన్నారు. గ్రాంథికభాషగా ఉన్న తెలుగును వ్యవహారిక భాషలోకి సరళీకరించి అందరూ ఇష్టపడేలా చేసిన గిడుగు రామ్మూర్తి జయంతిరోజైన ఆగస్టు 29 వ తేదీని మనం ‘‘తెలుగు భాషా దినోత్సవం’’గా జరుపుకుంటున్నామని, తేనెలొలుకు తెలుగుని అందరికీ మరింత దగ్గర చేసిన మహానుభావుడు ఆయన అని జయరాం కోమటి ప్రశంసించారు.
56 అక్షరాల తెలుగు భాషను గొప్పదనాన్ని మనతోపాటు ఎంతోమంది, విదేశీయులు కీర్తించారు. మనలోని భావాలను యథాతథంగా మాతృభాషలోనే చెప్పగలం. అందుకే మన పిల్లలకు మాతృభాషను నేర్పుదాం, మాతృభాషను నేర్చుకునేలా ప్రోత్సహిద్దాం అని జయరాం కోమటి పిలుపునిచ్చారు. మనం ఏదేశమేగినా తెలుగును మరువకూడదన్నారు. అమెరికాలో వేగంగా తెలుగు భాష విస్తరిస్తోందని కోమటి జయరాం గుర్తు చేశారు. తెలుగు భాషలో రాయటం, చదవడం, మాట్లాడడం నేర్చుకొని తెలుగుతనాన్ని ముందుకు తీసుకెళదాం, తెలుగు భాష సంపదను రానున్న తరాలకు అందజేద్దాం అని ఆయన పిలుపునిచ్చారు.













