ఎపి ప్రగతిలో భాగస్వాములు కండి…. వాషింగ్టన్ డీసీలో జయరామ్ కోమటి పిలుపు
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో అభివృద్ధిపరుస్తోందని ఈ అభివృద్ధిలో ఎన్నారైలు కూడా భాగస్వాములు కావాలని, జన్మభూమి అభివృద్ధికి కృషి చేయాలని అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరాం కోమటి కోరారు. వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఎన్నారైలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఐటీ, టూరిజం, విద్య,వైద్యరంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని ఎన్నారైలు తమవంతుగా రాష్ట్ర అభివృద్ధికి ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహకారాన్ని అందిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో అమరావతికి రాజధానిగా చట్టబద్దతను తీసుకువచ్చిందని, అలాగే వివిధ రంగాల్లో కేంద్రం ద్వారా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధిపరిచేందుకు కృషి చేస్తున్నారని గ్రామాల్లో మౌళిక సదుపాయాల కల్పనకు విస్తృతంగా కృషి చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి మాట్లాడుతూ, జన్మభూమి అభివృద్ధికి తమవంతుగా తోడ్పాటును అందిస్తామని తెలిపారు. సాయి బొల్లినేని, సుధీర్ కొమ్మి, భానుమాగులూరి, యాష్ బొద్దులూరి, అనిల్ ఉప్పలపాటి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రగతికి జయరాంగారి సహకారంతో కృషి చేస్తామని చెప్పారు.

ఆఫ్ బిజెపి యుఎస్ ఎ అధ్యక్షుడు అడపా ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నారైలకు అవసరమైన తోడ్పాటును అందించడంలో జయరాంగారు ఎల్లప్పుడూ ముందుంటారని చెప్పారు.
జనసేన పార్టీ ప్రతినిధులు విజయ్ గుడిసేవ, వేణు పులిగొండ్ల మాట్లాడుతూ, కూటమి నాయకులు సమైక్యంగా ఉంటూ రాష్ట్ర ప్రగతికి కృషి చేస్తున్నారని, అదే విధంగా ఇక్కడ ఉన్న తామంతా కూడా కలిసికట్టుగా రాష్ట్ర ప్రగతికి పాటుపడుతామని చెప్పారు.
గుంటూరి మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ, రాష్ట్రానికి జయరాం చేస్తున్న సేవలను అభినందించారు.
తెలుగు దేశం పార్టీకి విశేష సేవలందించిన శ్రీనివాస్ చౌదరి యలమంచిలి మృతిపట్ల అందరూ సంతాపం వ్యక్తం చేస్తూ ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జిడబ్ల్యుటీసిఎస్ అధ్యక్షుడు రవి అడుసుమిల్లి, సాయిసుధా పాలడుగు, సతీష్ చింత, త్రిలోక్ కంతేటి, సత్యనారాయణ మన్నె, రాజేశ్ కాసరనేని, కృష్ణప్రియ అడుసుమిల్లి, కంచర్ల కిషోర్, పద్మజ బేవర, నాగ్ నెల్లూరి, జానకిబోగినేని తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.








