అమెరికాపై దాడులకు సులేమాన్ ప్రణాళిక : ట్రంప్
యుద్ధాన్ని ఆపేందుకే ఇరాన్ టాప్ కమాండర్ ఖాసీమ్ సులేమానిని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. యుద్ధాన్ని మొదలు పెట్టడం తన ఉద్దేశం కాదన్నారు. ఉగ్రవాది సులేమాని భయానక పాలన ముగిసిందన్నారు. ఇరాక్‌లోని బగ్దాద్ విమానాశ్రయం వద్ద అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో సులేమాని హతమైన విషయం తెలిసిందే. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం వస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన ఆదేశాల ప్రకారమే అమెరికా మిలిటరీ ఎటువంటి పొరపాటు లేని ఆపరేషన్ చేపట్టినట్లు ట్రంప్ తెలిపారు.
ప్రపంచ నెంబర్ వన్ ఉగ్రవాదిని హతమార్చినట్లు చెప్పారు. అమెరికా దౌత్యవేత్తలు, సైనిక సిబ్బందిపై సులేమాని దాడులకు ప్లాన్ చేస్తున్నారని, దాన్ని పసికట్టి అతన్ని తుదముట్టించామన్నారు. యుద్ధాన్ని ఆపేందుకే కాని యుద్ధాన్ని ఆరంభించేందుకు ఈ చర్య చేపట్టలేదన్నారు. ఇరాన్ ప్రజల పట్ల తనకు అమితమైన గౌరవం ఉందన్నారు. ఇరాన్లో పాలన మారాలన్నది తమ ఉద్దేశం కాదు అని ట్రంప్ తెలిపారు. కానీ మధ్యప్రాశ్చ ప్రాంతంలో ఇరాన్ చేస్తున్న రాజకీయాలకు మాత్రం చెక్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.













