భారత్‌తో బలమైన మైత్రే ట్రంప్ లక్ష్యం : అమెరికా
భారత్‌తో బలమైన సంబంధాలను కొనసాగించడమే ట్రంప్ ప్రభుత్వ లక్ష్యమని అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ సృష్టం చేశారు. రెండు దేశాలూ భద్రతాపరంగా ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, కలిసి పనిచేస్తే ఎన్నో ప్రయోజనాలను పొందే అవకాశం ఉందని అన్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ఆయన పెంటగాన్‌లో సమావేశమైన కీలక ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇరు దేశాలు కలసికట్టుగా ముందుకెళ్లే రీతిలో సరికొత్త మర్గాల్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందని దోవల్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఎప్పటికప్పుడు మైత్రీబంధం కొత్త పుంతలు తొక్కినప్పుడే అన్ని విధాలుగా బలపడే అవకాశం ఉంటుందని అన్నారు. అమెరికాతో భారత్ బంధం ప్రత్యేకమైనదని, దీనికి తామెంతో విలువిస్తామని అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా బలపడాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం కోరుకొంటోందని తెలిపారు.













