త్వరలో ట్రంప్ -కిమ్ భేటీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అతి త్వరలో భేటీ కానున్నారని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. ఇరుదేశాధినేతలు ఎప్పుడు, ఎక్కడ భేటీ అవుతారనే విషయంపై మాత్రం ఆయన సృష్టతనివ్వలేదు. కాగా, కొరియా ద్వీపకల్పంలో దక్షిణకొరియా, అమెరికా దేశాల సైన్యం సంయుక్త విన్యాసాలు నిర్వహించింది. ఈ విన్యాసాలను రద్దు చేసుకోవాలని కిమ్ కోరినప్పటికీ దక్షిణకొరియా, అమెరికా దేశాలు పెడచెవిన పెట్టాయి. అగ్రరాజ్యాన్ని హెచ్చరించాలనే ఉద్దేశంతోనే మూడుసార్లు స్వల్పశ్రేణి క్షిపణులను ప్రయోగించినట్టు ఉత్తరకొరియా ప్రకటించింది. అమెరికా చర్యలు తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఉత్తరకొరియా రక్షణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో పాంపియో స్థానిక మీడియాతో మాట్లాడారు. ఇరుదేశాధినేతల మధ్య అతి త్వరలో చర్చలు జరుగనున్నాయని అన్నారు. కొరియా ద్వీపకల్పంలో శాంతిస్థాపన కోసం చర్చలు నిర్వహిస్తామని అన్నారు.













