అమెరికా ప్రభుత్వానికి హెచ్-1బీ వీసాదారుల వినతి
ఉద్యోగాలు పోయినప్పుడు తాము చట్టబద్ధంగా అమెరికాలో ఉండాల్సిన సమయాన్ని 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచాలని హెచ్-1బీ వీసాదారులు డొనాల్డ్ ట్రంప్ సర్కారుకు విజ్ఞప్తి చేశారు. వీరిలో ఎక్కువ మంది భారత ఐటీ నిపుణులే ఉన్నారు. కరోనా వైరస్ తాకిడికి ఉద్యోగాలు పోయే పరిస్థితి రావడంతో వారు ఈ మేరకు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. హెచ్-1బీ వీసాదారులు ఉద్యోగాల్ని కోల్పోతే చట్టబద్ధంగా 60 రోజులు మాత్రమే అమెరికాలో ఉండొచ్చు. ఈలోగా వేరే ఉద్యోగం సంపాదించాలి. లేకుంటే కటుంబంతో సహా స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలి. ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలు కోల్పోయాక అమెరికాలో 180 రోజులు ఉండేందుకు వెసులుబాటు కల్పించాలని ఈ వీసాదారులు ప్రభుత్వానికి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇప్పటివరకు 20వేల మంది సంతకాలు చేశారు. అమెరికా అధ్యక్షుడి నుంచి స్పందన కావాలంటే కనీసం లక్ష సంతకాలు కావాలి.













