తానా “నారీ- సాహిత్య భేరి” విజయవంతం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం, ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ విజయదశమి సందర్భంగా అంతర్జాలంలో నిర్వహించిన “నారీ -సాహిత్య భేరీ” కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 24 మంది వాగ్గేయకారినులు పాల్గొని అద్బుతమైన స్వీయ సాహిత్యం తో కూడిన పాటలను వినిపించారు.
తానా అధ్యక్షులు తాళ్ళూరి జయశేఖర్ మాట్లాడుతూ “మహిళా సాహితీవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో “నారీ- సాహిత్య భేరి” శీర్షికను ప్రారంభించామని, నారి లేకపోతే- నర లోకమే లేదని, వనిత లేకపోతే- జనతే లేదని, కాంత లేకపోతే- కలియుగమే లేదని, విశ్వ విజయ భేరి- వీర నారి అంటూ నారీ శక్తిని గౌరవించడం, అభిమానించడం మన అందరి కర్తవ్యం” అన్నారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని, మనోనిబ్బరాన్ని నింపటానికి మహిళా సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుందని, మహిళా సాహితీవేత్తలను ప్రోత్సహించడం ద్వారా నవ సమాజానికి నాంది పలికినట్లవుతుందని, రానున్న కాలంలో మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు అందిస్తామని” ప్రకటించారు.
సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ “నారీ సాహిత్య భేరి” శీర్షిక ప్రారంభించడం తానా తెలుగు సాహితీ చరిత్రలోనే ఒక మైలురాయని, ఇది ఒక శుభ పరిణామం”అన్నారు. ఈ గాన లహరి కార్యక్రమంలో “మహిళలు మేల్కొనాలి అని, హక్కుల కోసం పోరాడాలని, అమ్మను మించిన దైవం లేదని, సృష్టికి మూలం స్త్రీ అని, ప్రతి పురుషుడి విజయం వెనక స్త్రీ ఉందని, స్త్రీ శక్తిని మించిన శక్తి మరొకటి లేదని, స్త్రీ సాధించలేని విజయం అంటూ ఏదీ లేదని, స్త్రీ నడుం బిగించి ముందుకు సాగాలని, పిరికితనంతో వెనుకడుగు వేయరాదని, మహిళల పై అత్యాచారాలు జరుపుతున్న మానవ మృగాల పై తిరగబడాలని” అనేక సందేశాత్మక నేపథ్యంతో కూడిన పాటలను, గేయాలను ఆలపించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయ అతిథులు – శ్రీమతి మంగిపూడి రాధిక (సింగపూర్), డాక్టర్ బండారు సుజాత శేఖర్ (హైదరాబాద్), శ్రీమతి కవుటూరి గాయత్రి (ఖమ్మం), శ్రీమతి యామినీ కనకతార (హైదరాబాద్), డాక్టర్ సుధా ఆమంచి (నోయిడా), శ్రీమతి బుర్ర పద్మశ్రీ (హైదరాబాద్), శ్రీమతి నిభానుపూడి శ్రీ వాణి (హైదరాబాద్), శ్రీమతి తిరుపతిగారి అంబుజ (మహబూబ్ నగర్), డాక్టర్ పండ్రంగి శారద (ఒరిస్సా), శ్రీమతి అడ్డగూరి శ్రీ లక్ష్మీ (మంచిర్యాల), శ్రీమతి ఎడవల్లి శ్రీదేవి (తాడేపల్లిగూడెం),శ్రీమతి వజ్రాల ఇందిర (తిరువూరు), శ్రీమతి వాణి ప్రభాకరి (తణుకు), శ్రీమతి బాన్న రాజేశ్వరి (వైజాగ్), శ్రీమతి సీతాలత (అనకాపల్లి), శ్రీమతి కందూరు సుజాత రాణి (హైదరాబాద్),శ్రీమతి లక్ష్మీ పెండ్యాల (హైదరాబాద్), శ్రీమతి వై.కే. సంధ్య శర్మ (చిత్తూరు), శ్రీమతి అడ్డగూడి ఉమాదేవి (వరంగల్), కుమారి పి. వీ. సాయి అనూఙ్ఞ (వైజాగ్), శ్రీమతి ఇంజపురి వసంత (కరీంనగర్), శ్రీమతి బి. అంజనీ దేవి (గుంటూరు), డాక్టర్ భల్లూరి ఉమాదేవి (డల్లాస్), శ్రీమతి సుందరవల్లి తిరుమల (న్యూజెర్సీ). తానా అంతర్జాతీయ మహిళా విభాగపు సారథి శ్రీమతి లక్ష్మీ దేవినేని ఈ కార్యక్రమం చాలా చక్కగా ఉందని, మహిళలకు తానా పెద్ద పీట వేస్తుంది అనడానికి ఇదొక మచ్చుతునక అని అన్నారు.
తానా మహిళా సేవా విభాగపు నిర్వాహకురాలు శ్రీమతి శిరీష తూనుగుంట్ల తన వందన సమర్పణలో ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రసార మాధ్యమాల వారికి, సాంకేతిక సహకారాన్ని అందించిన తానా కార్యనిర్వాహక సభ్యుడు సుమంత్ రామిశెట్టి కి, ఇతర కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.











































































