ఈబీ-5 వీసా దరఖాస్తులకు గడువు పెంచిన అమెరికా
అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్‌కార్డు పొందేందుకు షార్ట్‌కట్‌గా భావించే ఈబీ-5 వీసాల దరఖాస్తు గడువును ట్రంప్ సర్కారు పొడిగించింది. 2018 ఆర్థిక సంవత్సరానికి గాను గడువు తేదీ సెప్టెంబర్ 30 ముగియగా, డిసెంబరు 7 వరకు పొడిగించారు. ఈబీ-5 వీసా ఉన్నవారికి రెండేళ్లలో షరతులతో కూడిన గ్రీన్‌కార్డు వస్తుంది. ఆ తర్వాత రెండేళ్లకు సదరు షరతులను ఎత్తివేసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్రరాజ్యం అమెరికా ఏటా 10 వేల ఈబీ-5 వీసాలు ఇస్తుండగా, ప్రతి దేశానికి 700 చొప్పున కోటా ఉంటుంది. ప్రస్తుతం భారత్ నుంచి 307 దరఖాస్తులు వచ్చాయని, ఇంకా 393 మందికి అవకాశం ఉందని అమెరికా అంతర్గత భద్రత విభాగం (డీహెచ్ఎస్) వెల్లడించింది. ఈ వీసాకు దరఖాస్తు చేసేవారు అమెరికాలో రూ.7.2 కోట్లు మేర పెట్టుబడులు పెట్టాలి. కనీసం 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలిస్తే, తమ కుటుంబ సభ్యులతో సహా గ్రీన్‌కార్డు దరఖాస్తుకు అర్హత పొందుతారు.













