ఫేస్ బుక్ కు మరోసారి ఎదురుదెబ్బ
సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గంటల వ్యవధిలో 24 శాతం మేర నష్టపోయింది. కేవలం రెండు గంటల వ్యవధిలో ఫేస్బుక్ ఏకంగా 15 వేల కోట్ల డాలర్లు (సుమారు రూ.పది లక్షల కోట్లు) నష్టపోయింది. సంస్థ సీఈవో మార్కె జుకెర్‌బర్గ్ సంపద కూడా 1680 కోట్ల డాలర్లు (సుమారు రూ.లక్షా 15 వేల కోట్లు) తరిగిపోయింది. అంటే తన సంపదలో దాదాపు ఐదో వంతు కోల్పోవడం విశేషం. ఫేస్బుక్ షేర్లు ఇలాగే గురువారం కూడా పతనమైతే బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో జుకెర్‌బర్గ్ మూడు నుంచి ఆరోస్థానానికి పడిపోతారని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ వెల్లడించింది. అదే జరిగే జుకెర్‌బర్గ్ సంపద 7 వేల కోట్ల డాలర్ల కంటే తక్కువకు చేరుతుందని ఆ రిపోర్ట్ సృష్టం చేసింది. కేంబ్రిడ్జి అనలిటికా డేటా స్కాంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఫేస్బుక్ లాభాలు ఏడాదిలో 47 శాతం నుంచి 44 శాతానికి పడిపోయాయి. గత మూడేళ్లలో ఫేస్‌బుక్‌కు ఇదే అతి తక్కువ వృద్ధిరేటు కావడం విశేషం. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఫేస్బుక్ లాభం 510 కోట్ల డాలర్లుగా ఉంది. అంటే షేరుకు 1.74 డాలర్ల మేర లాభాలు సాధించింది. రోజువారీ ఫేస్బుక్ యూజర్ల సంఖ్య 147 కోట్లుగా ఉంది.













