డొనాల్డ్ ట్రంప్ మాజీ క్యాంపెయిన్ మేనేజర్ అరెస్టు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ క్యాంపెయిన్ మేనేజర్ బ్రాడ్ పార్స్కలేను పోలీసులు అరెస్టు చేశారు. తనను తరచు శారీరకంగా హింసిస్తున్నట్లు ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద పది తుపాకులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మియామీకి 50 కి.మీ. దూరంలో ఉన్న ఫోర్ట్ లాడర్డేల్లో ఆదివారం వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో 44 సంవత్సరాల బ్రాడ్ తన భార్యపై చేయి చేసుకుని, తుపాకీతో కాల్చుకుని చనిపోతానని బెదిరించినట్లు సమచారం. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఆ ఇంటికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తానేమీ తప్పు చేయలేదని బ్రాడ్ పోలీసులతో తెలిపారు. కాగా జులై వరకు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారానికి మేనేజర్‌గా వ్యవహరించిన ఆయనను పనితీరు సంతృప్తికరంగా లేకపోవటంతో ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు ఆ పదవి నుంచి తొలగించటం గమనార్హం.













