దీపావళి వేడుకల్లో పాల్గొన్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. వైట్‌హౌస్‌లోని రూజ్వెల్ట్ రూమ్‌లో జరిగిన ఈ వేడుకల్లో ట్రంప్‌తో పాటు భారత రాయబారి నవతేజ్ సింగ్ సర్నా, ఆయన భార్య అవినా, పలువురు ఇండో అమెరికన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ అమెరికాకు భారత్‌తో ధృడమైన సంబంధాలు కలిగి ఉందని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో తనకు ఉన్న స్నేహం చాలా గొప్పదని వ్యాఖ్యానించారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలు మరింత బలపడేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. భారత్ మంచి సంధానకర్త అని కొనియాడారు. అమెరికాతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులకు, జైనులక దీపావళి అతిపెద్ద పండుగని ఆయన అన్నారు. కోట్లాది మంది తమ కుటుంబాలతో కలిసి వారి జీవితాల్లో కాంతులు నిండాలని కోరుకుంటూ ఈ వేడుకను జరుపుకుంటారని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ దీపావళి వేడుకల్లో పాల్గొనడం వరుసగా ఇది రెండోసారి. గతేడాది కూడా వైట్‌హౌస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2003లో మొదటిసారి దీపావళి వేడుకలను శ్వేతసౌధంలో నిర్వహించారు.













