“ఇప్పుడు అన్నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు”- CPI నారాయణ
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) తెలంగాణ రాష్ట్ర సెక్రెటరీ, మాజీ ఎంపి, శ్రీ కే. నారాయణ గత కొన్ని రోజులుగా అమెరికా లో ఉంటూ, శాన్ హోసే నగరం వచ్చిన సందర్భంగా స్థానిక స్వాగత్ రెస్టారెంట్ లో శ్రీ జయరామ్ కోమటి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం లో వచ్చిన తెలుగు వారితో దేశ రాజకీయాలు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలు గురించి అనేక విషయాలు మాట్లాడారు.
దేశం లో రాజకీయాల పరిస్తితి మీద ఒక ప్రశ్న కు సమాధానం గా “ఇప్పుడు దేశం లోనూ, రాష్ట్రాలలోనూ పూర్తిగా బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఎదురు పార్టీ లో నాయకులను ఏదో విధంగా న్యాయ వ్యవస్థ, CBI, CID లాంటి ప్రభుత్వ సంస్థల సహాయంతో బెదిరించి తమ దారిలోకి తెచ్చు కొంటున్నారు. ప్రజా స్వామ్యం లో ఇలాంటి పరిస్తితి రావటం చాలా బాధాకరం” అని అన్నారు.
ఈ వారం లో పార్లమెంట్ లో జరుగుతున్న అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడుతూ ” ప్రతిపక్ష పార్టీ లందరూ కలిసి కూటమి గా మణిపూర్ సంఘటన ల మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఇప్పుడు పార్లమెంట్ లో వున్న సంఖ్యాబలంతో గెలవరని తెలుసు.. కానీ అతి ముఖ్యమైన సంఘటన మీద పార్లమెంట్ లో డిస్కషన్ అవ్వాలి, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ తప్పని సరి ఈ విషయం పై మాట్లాడాలి అని అవిశ్వాస తీర్మానం పెట్టారు. ప్రధాన మంత్రి చేత మాట్లాడించారు.. అదే ప్రతి పక్షం కోరుకుంది. అది ఒక విధంగా ప్రజాస్వామ్య విజయమే” అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రెండు కమ్యూనిస్ట్ పార్టీల (CPI & CPM) ల రోడ్ మాప్ గురించి మాట్లాడుతూ శ్రీ నారాయణ “మేము ( CPI) ప్రతి పక్షం లో పని చేస్తాము. ఎన్నికల లో ప్రతి పక్షం గానే పోరాడుతాము. ఇదివరకు, ఇప్పుడు కూడా మాకు చంద్రబాబు నాయుడి మీద, తెలుగు దేశం పార్టీ మీద స్నేహ భావం వుంది. వారితో కలవటానికి మాకు అభ్యంతరం లేదు. అయితే తెలుగు దేశం ఒక వైపు బీజేపీ తో కలిసి రెండో వైపు మాతో కలవనుకోవటం తప్పు. బీజేపీ తో కలిసిన పార్టీ తో మేము కలవం” అని అన్నారు. పొత్తుల గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం గా “ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోనే అధికార పార్టీ అయిన వైఎస్సార్ పార్టీ, ప్రతి పక్ష పార్టీ అయిన తెలుగు దేశం కూడా బీజేపీ తో స్నేహం గా వుంటున్నాయి, ఎన్నికల్లో కలిసి పోటీ చెయ్యాలి అని అనుకుంటున్నాయి. ఇది ఒక విధం గా విచిత్ర పరిస్తితి. ఆ రెండు పార్టీలు ఎన్నికల్లో బహిరంగంగా కలవక పోయినా, కలిసి మెలిసి వుంటాయి అనిపిస్తోంది” అన్నారు.
“అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు కూడా అధికారం కోసం పని చేస్తారు.. పార్టీ అధికారం లోకి రాకపోతే, పార్టీ ని వదిలేస్తారు. అయితే కమ్యూనిటీ పార్టీ మాత్రం అధికారం లేక పోయినా, సిద్దాంతం కోసం, ప్రజలు కోసం పని చేస్తుంది.” అని అన్నారు.
అందరితో ఆత్మీయంగా మాట్లాడినందుకు శ్రీ జయరామ్ కోమటి బే ఏరియా తెలుగు వారి తరుపున శ్రీ నారాయణ కు ధన్యవాదాలు తెలిపారు.













