అగ్రరాజ్యం అతలాకుతలం
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్ సృష్టిస్తున్న విధ్వసం అంతా ఇంతా కాదు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 4,591 మంది 24 గంటల్లో ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఒక్కరోజు 2,569 మంది మరణిస్తే, గురువారం రాత్రి 9 గంటలయ్యే సరికి దాదాపుగా అంతకు రెట్టింపు సంఖ్యలో మరణాలు నమోదు కావడం ఆందోళన రేపుతోంది. మొత్తంగా మృతుల సంఖ్య 33 వేలు దాటేసింది. మొత్తంగా మృతుల సంఖ్య 33 వేలు దాటేసింది. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్లో కోవిడ్ విశ్వరూపం చూపిస్తోంది. అమెరికాలో నమోదైన కేసుల్లో 30 శాతం మంది ఆఫ్రికన్ అమెరికన్లకే సోకింది. కరోనా కట్టడి కాకపోతే అమెరికాలో లక్ష నుంచి 2 లక్షల 40 వేల మంది వరకు చనిపోతారని అంచనాలున్నాయి. అయితే గత ఏడు రోజులుగా దేశవ్యాప్తంగా 850 కౌంటీలలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని ఆరోగ్య శాఖ నిపుణులు వెల్లడించారు. ఇప్పటికే వైరస్ సోకినవారికి చికిత్స అందించడానికి వివిధ రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. యాంటీ వైరల్ థెరపీలు, ఇమ్యూన్ థెరపీ, బ్లడ్ ప్లాస్మా థెరఫీ వంటివి సత్ఫలితాల్నే ఇస్తున్నాయి.













