రోబో మాత్రతో కొలనోస్కోపీ
పేగుల్లో కేన్సర్ జాడలను ముందే పసిగట్టే రోబో మాత్రను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కేవలం 18 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్న ఈ బుల్లి మాత్రను కంప్యూటర్కు అనుసంధానించిన అయస్కాంతంతో నియంత్రించవచ్చన్నారు. ఈ వినూత్న మాత్ర బాధాకరమైన కొలనోస్కోపి పరీక్షలకు మంచి ప్రత్యామ్నాయమని వాండెర్బిల్ట్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనిని శరీరంలోకి పంపించి పేగుల్లోని కేన్సర్ కణితులను, భవిష్యత్తులో కేన్సర్ కణితిగా మారే గడ్డలను గుర్తించవచ్చని తెలిపారు. కాగా, పేగు కేన్సర్ ముప్పును గుర్తించడంలో కొలనోస్కోపిక్ పరీక్ష చాలా బాగా ఉపయోగపడుతున్నా, దీనివల్ల శారీరకంగా కొంత అవస్థ, అసౌర్యం తప్పదు. దీంతో చాలా మంది ఈ పరీక్షలు చేయించుకోవడాన్ని వాయిదా వేస్తుంటారు. రోబో మాత్రం ఈ చిక్కులను పరిష్కరిస్తుందని పరిశోధకులు తెలిపారు.













