తెలుగు వైభవాన్ని తలపించేలా ఆటా 19వ మహాసభలు : తెలుగు టైమ్స్‌తో అధ్యక్షుడు జయంత్ చల్లా
అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న ‘అమెరికా తెలుగు సంఘం (ఆటా) ప్రతిష్టాత్మక 19వ మహాసభలకు సర్వం సిద్ధమవుతోంది. జూలై 31, ఆగస్టు 1, 2 తేదీలలో బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా తెలుగు టైమ్స్ తో కాన్ఫరెన్స్ వివరాలను పంచుకున్నారు. వాటి వివరాలను ఇక్కడ ఇస్తున్నాము.
బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరగబోయే ఈ 19వ ఆటా మహాసభలు ఒక పండుగ వాతావరణంలో, కుటుంబ సమేతంగా ఆనందించేలా ఉంటాయని జయంత్ చల్లా అంటూ, ఈ మహాసభలకోసం దాదాపు 70కి పైగా ప్రత్యేక సబ్-కమిటీలను (కల్చరల్, బిజినెస్ అండ్ స్టార్టప్స్, యూత్ ఫోరమ్స్, పొలిటికల్ ఫోరమ్స్, ఉమెన్స్ ఫోరమ్స్, కల్చరల్ కమిటీలు ఇలా పలు కమిటీలను ఏర్పాటు చేశాము. కమిటీలన్ని తమ పనులను పూర్తి చేస్తున్నాయి. ప్రణాళిక ప్రకారం కార్యక్రమాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాయి.
ప్రముఖులకు ఆహ్వానం
ఈ మహాసభలకు రావాల్సిందిగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు, మంత్రులను, ఇతర పార్టీల నాయకులను స్వయంగా కలిసి ఆహ్వానించామని, ఈ మహాసభలకు అందరూ వస్తానని చెప్పారని తెలిపారు. వీరితోపాటు సాహితీవేత్తలు, సినీరంగానికి చెందిన నటీనటులు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులు ఇలా అందరూ తరలివస్తున్నారని చెప్పారు. బిజినెస్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయా రంగాల ప్రముఖులు వస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతినిధులను పంపిస్తామని హామి ఇచ్చారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వస్తానని హామి ఇచ్చారు. ఇలా పలువురు నాయకులు ఆటా మహాసభలకు వచ్చేందుకు సంసిద్ధత తెలిపారు.
వివిధ పోటీలు, కార్యక్రమాలు
ఈ మహాసభలకోసం వివిధ పోటీలను కూడా ఏర్పాటు చేశామన్నారు. మహాసభల నిర్వహణకు ముందుగా అమెరికాలోని 12 ప్రధాన నగరాల్లో ప్రత్యేక కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “ఝుమ్మంది నాదం” (గాన పోటీలు) మరియు “సయ్యంది పాదం” (నృత్య పోటీలు) కార్యక్రమాల ద్వారా వేలాది మంది యువతను తెలుగు భాష, సంగీతం, నృత్యం, సంస్కృతి వైపు ఆకర్షించేలా చేస్తున్నాము. విదేశాల్లో పెరుగుతున్న భావితరాలకు తెలుగు సంస్కృతికి వారధిగా ఆటా మహాసభలు కనిపిస్తున్నాయి. వర్జీనియా, చికాగో, డెలావేర్ వ్యాలీ, న్యూజెర్సీ, ఆర్లాండో, ఆస్టిన్, ఫీనిక్స్, అట్లాంటా, డల్లాస్, రాలీతో పాటు అమెరికాలోని అనేక ప్రధాన నగరాలలో నిర్వహించిన ఈ పోటీలలో ప్రతి నగరంలో సగటున 150 నుండి 200 మంది వరకు పాల్గొన్నారు. మొత్తం మీద వేలాది మంది విద్యార్థులు, వందలాది కుటుంబాలు ఈ కార్యక్రమాలలో భాగస్వాములై తెలుగు సంస్కృతి పరిరక్షణ పట్ల తమ అంకితభావాన్ని చాటి చెప్పారు.
ఇవి కూడా చదవండి
సాంస్కృతిక కార్యక్రమాలు
కళాకారులకు వేదిక – కళాభిమానులకు వేడుక అనే నినాదంతో ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలను వినూత్నంగా రూపొందిస్తున్నాము. సంగీతం, క్లాసికల్, మోడరన్ నృత్యాలు, జానపద కళలు వంటి వివిధ విభాగాల్లో ప్రదర్శనలు ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న వారిని ఆహ్వానించాము. ఈ కార్యక్రమాలు కేవలం గాన, నృత్య పోటీలు మాత్రమే కావు. తెలుగు సంగీతం, సాహిత్యం, నృత్య సంప్రదాయాలు, కళా వైభవం మరియు మన సంస్కృతి గొప్పతనాన్ని యువతకు పరిచయం చేసే సాంస్కృతిక విద్యాలయాలు. అమెరికా వంటి బహుళ సంస్కృతులు, భాషలు, జాతులు కలిసి జీవిస్తున్న సమాజంలో పెరుగుతున్న తెలుగు పిల్లలకు తమ మూలాలను గుర్తు చేస్తూ, తమ సంస్కృతిపై గౌరవాన్ని పెంపొందించే విలువైన వేదికలుగా ఇవి నిలుస్తున్నాయి. తెలుగు భాష, సంస్కృతి, కళలు కేవలం వినోదానికి సంబంధించిన అంశాలు కావు; అవి మన చరిత్రకు, మన సంప్రదాయాలకు, మన కుటుంబ విలువలకు, మన అస్థిత్వానికి ప్రతీకలు. విదేశాల్లో జన్మించి పెరుగుతున్న రెండవ, మూడవ తరం యువతకు తమ మూలాలను పరిచయం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తమ సంస్కృతిని అర్థం చేసుకున్న యువత ఇతర సంస్కృతులను కూడా మరింత గౌరవించే విశాల దృక్పథాన్ని అలవర్చుకుంటారు.
సినీతారలు… సంగీత విభావరులు
ఈ మహాసభల్లో పాల్గొనేందుకు సినీరంగానికి చెందిన పలువురుకళాకారులు వస్తున్నారు. హీరో, హీరోయిన్లతోపాటు, సంగీత దర్శకులు, గాయనీగాయకులు వస్తున్నారు. అలాగే సంగీత విభావరులను కూడా ఏర్పాటు చేశాము. ఈ ఏడాది కాన్ఫరెన్స్‌లో సినీ తారల సందడితో పాటు సంగీత ప్రియులను అలరించేందుకు భారీ ఏర్పాట్లు చేశాము. ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్, అలాగే యువతను ఆకట్టుకునే ప్రముఖ ‘నిరవల’ లైవ్ మ్యూజిక్ బ్యాండ్ ప్రదర్శనలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
యువత కోసం
అలాగే యువతలోని ప్రతిభను వెలికితీయడానికి సరికొత్త వేదికను సిద్ధం చేసింది. ఈ వేడుకల్లో భాగంగా షార్ట్ ఫిల్మ్ , రీల్స్, ఫోటోగ్రఫీ విభాగాల్లో భారీ పోటీలను ఏర్పాటు చేశాము. తమలోని కళాత్మక ఆలోచనలకు దృశ్య రూపం ఇచ్చే వర్ధమాన కళాకారులకు ఇదొక సువర్ణావకాశం. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి టాలీవుడ్ ప్రముఖ సినీ సెలబ్రిటీల చేతుల మీదుగా పురస్కారాలను అందజేయనున్నాము. వెండితెర దిగ్గజాల సమక్షంలో ప్రతిభను చాటుకోవడమే కాకుండా, వారి నుండే ప్రశంసలు పొందే వీలుండటంతో క్రియేటివ్ మైండ్స్ ఈ పోటీలపై ఆసక్తిని చూపుతోంది.
యువ పారిశ్రామికవేత్తలకు సువర్ణావకాశం
అమెరికాలోని ప్రవాస తెలుగు వారి ప్రముఖ సంస్థ ‘అమెరికా తెలుగు సంఘం’ (ఆటా), ప్రముఖ ఓటీటీ, టీవీ ప్లాట్‌ఫారమ్ ‘జీ5 టీవీ’ సంయుక్తంగా సరికొత్త వ్యాపార ఆలోచనలతో దూసుకుపోతున్న యువ పారిశ్రామికవేత్తల కోసం ఒక ప్రతిష్టాత్మక వేదికను సిద్ధం చేశాయి. ‘ఐడియా బాజ్ స్టార్టప్ కాంపిటీషన” పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీ, తమ స్టార్టప్‌లను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని భావించే వారికి ఒక అద్భుతమైన అవకాశంగా నిలవనుంది. ఔష్ట్రవతీవ ్పుaజూఱtaశ్రీ వీవవts Aఎbఱtఱశీఅ అనే నినాదంతో ఈ పోటీలను డిజైన్ చేశారు. పాల్గొనే స్టార్టప్‌లకు 1 బిలియన్ డాలర్లకు పైగా వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పొందే అవకాశం లభిస్తుంది. 50 మందికి పైగా ప్రఖ్యాతి గాంచిన బిజినెస్ మెంటార్ల ద్వారా వ్యూహాత్మక సలహాలు అందుతాయి. ప్రతిభ కనబరిచిన టాప్ 3 స్టార్టప్‌లకు జీ5 టీవీ ‘ఐడియా బాజ్ సీజన్ 2’ షోకేస్‌లో ఫీచర్ అయ్యే ప్రత్యేక అవకాశం దక్కుతుంది.
మ్యాట్రిమోనీ
తమ ప్రియమైన వారి కోసం పెళ్లి సంబంధాలను వెతుకుతున్న వారికి ఆటా మ్యాట్రిమోని ఒక అద్భుతమైన వేదికను అందిస్తోంది. రెండవ తరం యువత మరియు వారి తల్లిదండ్రులకోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము.
ఈ మహాసభల విజయవంతం కోసం నాతోపాటు కన్వీనర్ శ్రీధర్ బనాలా, కోఆర్డినేటర్ రవి చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల తదితర కోర్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్త నవలల పోటీ 2026
ప్రపంచంలోని ఏ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు రచయితలైనా పాల్గొనేందుకు వీలుగా నవలల పోటీలను నిర్వహిస్తున్నాము. నవలల పోటీల మొత్తం బహుమతుల విలువ 2 లక్షల రూపాయలు. నవలల నేపథ్యం ప్రపంచంలో ఎక్కడిదైనా కావచ్చు, కానీ అది తెలుగువారి జీవితానికి సంబంధించినదై ఉండాలి. అచ్చులో కనీసం 150 పేజీలైనా ఉండాలి. రచనలు సొంతమైనవి, అనువాదాలు కానీవి ఇదివరకు ఎక్కడా ప్రచురితం కానివై ఉండాలి. నవలా రచయితలను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో దీనిని నిర్వహిస్తున్నాము.
కథలు, కవితల పోటీలు
19వ ఆటా కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్షన” సందర్భంగా అమెరికా తెలుగు సంఘం సాహిత్య విభాగం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక సాహిత్య పోటీల నిర్వహణకు పూనుకుంది. అమ్మ భాష అభరణాలైన అక్షరాలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా కవులు, రచయితల సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నాము. సాహిత్యాభిమానులను అలరించేలా అంతర్జాతీయ అమెరికా జాతీయ స్థాయిలో రెండు వేర్వేరు విభాగాలుగా ఈ పోటీలు సాగనున్నాయి.
అమెరికా జాతీయ స్థాయి కథలు, కవితల పోటీలు
అమెరికాలో నివసిస్తున్న వారికోసం కథలు, కవితల పోటీలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాము. సప్త సముద్రాలు దాటినా తమ గుండె లోతుల్లోని భావాలను, సృజనాత్మకతను కథలు, కవితల రూపంలో వెలిబుచ్చాలనుకునే ప్రవాస తెలుగు రచయితలకు ఇది ఒక అపూర్వ పోటీగా నిలవను న్నది. ఆటా ఇచ్చే ఈ అవకాశాన్ని రచయితలు ఉపయోగించుకోవాలని కోరుతున్నాము.








