వలసదారులకు బాసటగా గూగుల్, యాపిల్, ఫేస్బుక్
వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ సంస్థలు గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ తాజాగా డ్రీమర్స్ వర్క్ పర్మిట్లను రద్దు చేయడంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రులతో కలిసి బాల్యంలోనే అమెరికాకు వచ్చి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న వారిని అక్రమ వలసదారులగా ట్రంప్ యంత్రాంగం గుర్తించిన నేపథ్యంలో తమ ఉద్యోగులకు బాసటగా నిలవాలని యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌తో సహా పలు అమెరికా టెక్నాలజీ కంపెనీలు నిర్ణయించాయి. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సైతం ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. డీఏసీఏకు మద్దతుగా అమెరికా కాంగ్రెస్ చర్యలు చేపట్టాలని సుందర్ పిచాయ్ ట్విట్టర్ లో ట్విట్ చేశారు. ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయాన్ని యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఖండించారు. ఈ నిర్ణయంతో తమ ఉద్యోగుల్లో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే వారికి ఇమిగ్రేషన్ నిపుణుల సూచనలతోపాటు, అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని కుక్ సృష్టం చేశారు.
తమ డ్రీమర్ల కోసం యాపిల్ పోరాడుతుందని కుక్ ట్విట్ చేశారు. డ్రీమర్లు అమెరికాను, పౌర సమాజాన్ని పటిష్టం చేశారని, ప్రతి ఒక్కరికి ఆర్థిక అవసరాల కోసం తాము కట్టుబడి ఉంటామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు. ఇక ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కూడా ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. గత అధ్యక్షుడు ఒబామా కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా తీసుకువచ్చిన డీఏసీఏకు అనుకూలంగా కాంగ్రెస్ మద్దతు కూడగట్టాలని పిలుపునిచ్చారు.













