అమెరికాలో సాయి దత్త పీఠం లో ఏపీ డిప్యూటీ స్పీకర్ పుట్టిన రోజు వేడుకలు
అమెరికా పర్యటనలో ఉన్న మండలి బుద్ధ ప్రసాద్ సాయి దత్త పీఠం పిలుపు మేరకు న్యూజెర్సీ విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి సాయి దత్త పీఠం నిర్వాహకులు ధర్మశ్రీ రఘుశర్మ శంకరమంచి, ఆలయ కమిటీ సభ్యులు, ఇతర పురోహితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమీషనర్ శ్రీ. ఉపేంద్ర చివుకుల, బుద్ధ ప్రసాద్ గారిని సభకు పరిచయం చేసి వేదిక పైకి సాదరంగా ఆహ్వానించారు. ఆ సాయి నాధుడి సన్నిధిలో గడిపిన మండలికి ఆలయ పురోహితులు వేద ఆశీర్వాదాలు అందించారు. మండలి పుట్టిన రోజు సందర్భంగా ఆయన కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు భాషా, సంప్రదాయాల పరిరక్షణ కోసం మండలి బుద్ధ ప్రసాద్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా రఘు శర్మ శంకరమంచి కొనియాడారు. వివాద రహితుడిగా, సౌమ్యుడిగా. అందరివాడిగా పేరు తెచ్చుకున్న మండలి బుద్ధ ప్రసాద్ మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మండలి పుట్టిన రోజు సందర్భంగా ఇక్కడే బర్త్ డే కేక్ కూడా కట్ చేసి… జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అమెరికాలో తెలుగువారు ఎన్నో విజయాలు సాధిస్తున్నారని, బాబా చెప్పిన శ్రద్ధ, సహనం కలిగి ఉండి మానవ సేవే మాధవ సేవ అంటూ సాయి దత్త పీఠం చేస్తున్న సేవా, సత్సంగ్, విద్య, ఛారిటీ వంటి పిల్లర్లతో నిర్విఘ్నంగా నడుస్తున్నందుకు రఘు శర్మకు వాలంటీర్లకు, దాతలకు మండలి బుద్ధ ప్రసాద్ అభినందనలు తెలియ చేశారు. భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని అమెరికాలో కొనసాగిస్తున్నందుకు సాయి దత్త పీఠంపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంలో సాయి దత్త పీఠం చేస్తున్న కృషి అభినందించదగినదన్నారు.













