ఎయిర్ ఇండియా దేశ విదేశీ మార్గాల్లో కొత్త సర్వీసులు
దేశీ, విదేశీ రూట్లలో వచ్చే నెల నుంచి కొత్త విమాన సర్వీసులను నడపనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. వేసవి సెలవుల దృష్ట్యా జూన్ 1 నుంచి వారానికి అదనంగా 3,500 సీట్లను ముంబై-దుబాయ్-ముంబై మార్గంలో, జూన్ 2 నుంచి వారానికి అదనంగా 3,500 సీట్లను ఢిల్లీ-దుబాయ్-ఢిల్లీ మార్గంలో రెండు కొత్త బీ787 డ్రీమ్లైనర్ల ద్వారా అందుబాటులోకి తేనున్నట్లు తెలియజేసింది. ప్రమోషనల్ ధరలో భాగంగా 2019 జూలై 31 వరకూ దుబాయ్‌కు ఒకవైపు ఎకనామీ క్లాస్ ధరను రూ.7,777గా నిర్ణయించినట్లు తెలియజేసింది. దేశీయంగా ఢిల్లీ-బోపాల్-ఢిల్లీ రూట్లో వారానికి 14 విమాన సర్వీసుల నుంచి 20 విమాన సర్వీసులకు అదేవిధంగా ఢిల్లీ-రాయ్‌పూర్-ఢిల్లీ రూట్లో ఉన్న వారానికి 7 విమాన సర్వీసులను వారానికి 14 విమాన సర్వీసులకు పెంచామని తెలిపింది.













