Achanta Lakshmi Manojna: క్వీన్స్ కామన్ వెల్త్ ఎస్సే కాంపిటీషన్ విజేత ఆచంట లక్ష్మీ మనోజ్ఞ
వసుధైవకుటుంబకమ్ అనే సార్వజనీన సార్వకాలిక దృక్పథం.. ప్రపంచ సాహిత్యంలో వలసవాద ధోరణుల ప్రాబల్యాన్ని ప్రశ్నిస్తూ అల్లాడిన ప్రపంచవ్యాప్తంగా ఉండే దీనప్రజానీకానికి మద్దతు తెలిపే కవిత్వ ధోరణి.. ఇలాటి పెద్దపెద్ద విషయాలు ఒక చిన్నారి కవితలలో కనపడటం మామూలు విషయం కానేకాదు. సింగపూర్ లో క్రెసెంట్ గర్ల్స్ స్కూల్ నుండి సెకండరీ 2 విద్యార్థిని అయిన ఆచంట లక్ష్మీ మనోజ్ఞ ఇలాటి గొప్ప అద్భుతాన్నే చేసి చూపించింది. పూవు పుట్టగానే పరిమళిస్తున్న చందంగా చదువుతో పాటు సంగీత సాహిత్యాలు పియానో వాదన, నృత్యం ఇలా బహువిధాలుగా తన ప్రజ్ఞను వికసింపజేసుకుంటున్న మనోజ్ఞ ఈ సంవత్సరం రాయల్ కామన్వెల్త్ సొసైటీ (RCS), పాఠశాలల కోసం ప్రపంచంలోనే అత్యంత పురాతన అంతర్జాతీయ రచనల పోటీ అయిన ‘ది క్వీన్స్ కామన్వెల్త్ ఎస్సే కాంపిటీషన్ (QCEC) 2025’ విజేతలలో ఒకరిగా ఎంపిక అవడం విశేషం. ఈమె తన కవిత్వం ద్వారా, విశ్వమానవాళి కి సంబంధించిన సంవేదనలతో తాదాత్మ్యాన్ని పొందుతుంది. వారి జీవితాలలో నిండిన దైనందిన భావావేశాల లయలను తన కవితలద్వారా స్పృశిస్తుంది. పియానో పట్టుకోని వేళలను ప్రపంచ పౌరుల సుఖదుఃఖాలను ప్రతిబింబించే కవితలను అల్లడానికి సమయాన్ని వినియోగిస్తుంది. పిన్న వయస్కురాలైనప్పటికీ ఈమె కవితా ధోరణులలో ఎలిజబెత్ లిమ్ మరియు ఆన్ లియాంగ్ వంటి రచయితలచే పొందిన ప్రభావాలున్నాయి.
మనోజ్ఞ రాసిన, బహుమతి గెలుచుకున్న ‘ఇండియా టు మారిషస్’ అనే కవిత, తన తల్లి నుండి వేరు చేయబడి, భారతదేశంలోని తన ఇంటి నుండి మారిషస్‌లోని ఒక ఎన్‌క్లోజర్‌కు తరలించబడిన ఒక చిన్న కోతి కథను చెబుతుంది. భారతదేశంలో జన్మించినా ఆరు నెలల వయస్సులో సింగపూర్‌కు వెళ్లి అక్కడ శాశ్వత నివాసం చేసే కుటుంబానికి చెందిన మనోజ్ఞ, ఈ పోటీకోసం ఎన్నుకునే ఇతివృత్తంగా – ‘అవర్ కామన్వెల్త్ జర్నీ’కి సంబంధించి భారతదేశం గురించి రాయాలనుకుంది.
ఆమెకు భారతదేశం మరియు మారిషస్‌లను కలిపే బానిస కార్మిక వ్యాపారం గురించి అవగాహన ఉంది. దానితో మరియు ఆ దేశాల మధ్య మార్గం గురించి, అలాగే మన భారతదేశం నుండి మారిషస్‌కు వచ్చిన వారి అనుభవాల గురించి పరిశోధించడం ప్రారంభించింది. కార్మికులతో పాటు అన్యదేశ వన్యజీవులతో కూడా వలసవ్యాపారం చేస్తున్నారని తెలుసుకొని వేదనపడ్డది., ఆ విషయమే కోతి కి సంబంధించిన ప్రతీకాత్మక దృష్టికోణం నుండి రాయడానికి ఆమెకు ప్రేరణగా మారింది.ఆమె బహుమతి పొందిన కవితలో భారతదేశం నుండి మారిషస్‌కు దాని దయనీయమైన ప్రయాణాన్ని వర్ణిస్తూ, మరియు తల్లిచెంత, స్వంత భూమిలో లభించే ఆత్మీయమైన వాతావరణం హఠాత్తుగా కోల్పోయి, పరాయి చోటున బందీయై పలుబాధలు పడుతూ తిరిగి తల్లి ప్రేమను ఆశిస్తూ అది లభించక పడే తపన…జాలికొలిపే తీరులో దాని ఆర్ద్రమైన కోరికను తన తల్లికి స్వగతంగా విన్నవించుకునే -పసికోతి ద్వారా చెప్పబడిన హృదయవిదారకమైన ఒక ఘటనకు చెందిన కవిత ఇది..
బందిఖానాలో ఉన్నప్పుడు , స్వానుభవాలపట్ల గమనిక..తను పొందిన తీపి అనుభవాలకూ.. ప్రస్తుతం అనుభవించే మనోవేదనకూ మధ్య జరిగే సంఘర్షణను ప్రతి ఒక్కరి హృదయాలను తాకేటట్టు వర్ణించే మనోహరమైన కవిత ఇది.
ఈ కవితను రాయడానికి భూమికగా – ఇండియానుండి సింగపూర్‌కు వచ్చి, ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకొని, తన మరియు తన సోదరి కోసం వారిదైన నూతన జీవితాన్ని ఏర్పరచుకున్న తీరుతెన్నులను గురించి తన తల్లిదండ్రులు చెప్పిన సంగతులు తనకు స్ఫూర్తినిచ్చాయని మనోజ్ఞ చెప్తుంది. ఇలాటి గంభీరమైన, ప్రభావశీలమైన కవితా రచనతోనే ప్రతిష్టాత్మకమైన క్వీన్స్ కామన్వెల్త్ వ్యాసరచన పోటీలో తను రన్నరప్‌గా ఎంపికైంది. ఈ అవార్డు ప్రదానోత్సవం వైభవంగా సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జరిగింది. తన కుటుంబ సభ్యులు ఆమె తండ్రి శ్రీనివాస్, తల్లి ప్రసన్న మరియు సోదరి శ్రీ మేఘనల సమక్షంలో చిరంజీవి మనోజ్ఞ ఈ అవార్డును హర్ మెజెస్టీ క్వీన్ కెమిల్లా నుండి అందుకుంది.






