హ్యూస్టన్ లో ఘనంగా 84వ నెల నెలా తెలుగు వెన్నెల
ఏప్రిల్ ఒకటో తారీకు నాడు మా 84వ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం మా ఇంట్లో జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా చాలా రసవత్తరంగా – ఎందుకంటే ఆ నాటి అతిధి సుప్రసిద్ధ అచ్చ తెనుగు అవధాని శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. ముందుగా చిలుకూరి సత్యదేవ్ కవి గారి పరిచయం చేశారు.
వంగూరి చిట్టెన్ రాజు- తను చదువుతున్న కొన్ని కథలు, వాటిల్లో ఉన్న ప్రత్యేకతల గురించి, ముఖ్యంగా శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారి ‘అరికాళ్ళ లో మంటలు” కథలో శిల్పం గురించి, గొల్లపూడి వారి ”వందేళ్ళ తెలుగు కథ వందనాలు” సంకలనంలో కథల ఎంపిక గురించి విశ్లేషించారు.
తరువాత ప్రధాన అతిధి పాలపర్తి వారు ”రసయానం -విశ్వనాధ” అనే అంశం మీద కూలంకషంగా మాట్లాడారు. అనేక రస ప్రధానమైన సంఘటనలు, పాత్రలను, అంశాలను సోదాహరణంగా వివరిస్తూ పాలపర్తి వారి ప్రసంగం ప్రశ్నోత్తరాల మధ్య ఆత్మీయ వాతావరణం లో అంటే పెద్ద వేదిక వెనకాల బేనర్లు, దండలూ వగైరా ఆర్భాటాలు లేకుండా జరిగింది. ఆఖరున స్వీయ రచనా విభాగంలో హాస్య రసానుభూతి కలిగించడానికి వంగూరి చిట్టెన్ రాజు -మళ్ళీ నేనే – ఆ రోజే కౌముది.నెట్ లో ప్రచురించబడిన ”అమెరికా పెంట కష్టాలు” కథలో కొన్ని భాగాలు చదివి వినిపించారు. ఆసక్తి ఉన్న వారు కౌముది.నెట్ లో ఆ కథ చదివి ఆనందించండి.
సభానంతరం మా టీసీయే తరఫున సాంస్క తిక కార్యదర్శి మంతెన శ్రీనివాస్, మా వెన్నెల తరఫున సత్యదేవ్, సుధేష్ పిల్లుట్ల, మధు పెమ్మరాజు, నేనూ పాలపర్తి వారిని శాలువ, తెలుగు పుస్తకాల తో సత్కరించడంతో సభ దిగ్విజయంగా ముగిసింది.
– వంగూరి చిట్టెన్రాజు













