ఈ నెల 11 నుంచి ఉత్తర అమెరికాలో ఘంటసాల ఆరాధనోత్సవాలు
వేగేశ్న ఫౌండేషన్ ఇండియా వారు వంగూరు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారితో కలిసి దివ్వాంగుల సహాయార్థం ఉత్తర అమెరికాలో ఈ నెల 11వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు 30 ప్రాంతాల్లో 11వ ఘంటసాల ఆరాధనోత్సవాలు, 8న ఎస్పీ బాలు సంగీతోత్సవాలు నిర్వహిస్తున్నట్టు వేగేశ్న ఇండియా- అమెరికా వ్వవస్థాపకుడు డా.వంశీ రామరాజు తెలిపారు. టెంపుల్ టెక్సాస్, డాలస్, హ్యాస్టన్, వర్జీనియా, చికాగో, కలమజు డ్రెటాయిట్, లాస్ఏంజెల్స్, ఇండియాన పోలీస్, చార్లెట్, గ్రీన్ విల్లా, ఆస్టిన్, అట్లాంటా, న్యూజెర్సీ, న్యూయార్క్, శాక్రివెంటో, సియాటిల్, ఆర్లెండో, సాల్ట్‌లేక్ సిటీ, పిట్స్బర్గ్, బోస్టన్, ర్యాలి, బ్లూమింగ్టన్, సౌత్ జాక్సన్, ఫ్లోరిడా, మయామి తదితర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఈ మహోత్సవంలో హైదరాబాద్‌కు చెందిన అపర ఘంటసాల బాలకామేశ్వరరావు తాతా, శివశంకరి గీతాంజలి ప్రధాన గాయకులుగా పాల్గొంటున్నారన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులను తెలంగాణలో 30 సంవత్సరాలుగా సేవలందిస్తున్న వేగేశ్న ఫౌండేషన్ దివ్వాంగులకు ఆశ్రమ సంక్షేమానికి ఉపయోగిస్తారన్నారు. ప్రముఖ రచయిత డా.వంగూరు చిట్టెన్రాజు ఆధ్వర్యంలో 11 సంవత్సరాలుగా ఘంటసాల ఆరాధనోత్సవాలు, ఎనిమిది సంవత్సరాలుగా ఎస్పీ బాలు సంగీతోత్సవాలు అమెరికాలో నిర్వహిస్తున్నారన్నారు. తెలంగాణ టూరిజం శాఖ వారు అమెరికాలో జరుగుతున్న ఈ ఉత్సవాలను ప్రోత్సహిస్తున్నారని రామరాజు తెలిపారు.













