అప్పటి వరకు పెళ్లి చేసుకోనని విశాల్ శపథం!
తెలుగువాడైనా తమిళంలో స్టార్ హీరోగా ఎదిగాడు విశాల్. తెరపైనే కాకుండా తెర వెనుక కూడా తన సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు. నడిగర్ సంఘం ఎన్నికల్లో హోరాహోరీ గా పోరాడిన విశాల్, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన విషయం తెలిసిందే. నడిగర్ సంఘం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా సంఘం భవన నిర్మాణాన్ని ప్రారంభించాడు విశాల్. తాజాగా ఈ భవనం శంకుస్థాపన కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది. రజనీకాంత్, కమల్‌హాసన్, అజిత్ వంటి అగ్రతారలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన విశాల్ భవన నిర్మాణం పూర్తయ్యే వరకు పెళ్లి కూడా చేసుకోనని శపథం చేశాడు. ఈ నిర్మాణాన్ని చాలా మంది ఆపాలని ప్రయత్నిస్తున్నారని, అయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతామని సృష్టం చేశాడు. ఈ భవన నిర్మాణం వచ్చే ఏడాది సెప్టెంబర్‌కల్లా పూర్తవుతుందని అన్నారు. ఆ తర్వాతే తన పెళ్లి గురించి ఆలోచిస్తానని అన్నారు.













